నేర్పుగా తీర్పు

Apr 21,2024 12:06 #Sneha

ముత్తయ్యను ఓ రైతుకు
ముగ్గురు కొడుకులున్నారు!
ఏ లోటూ లేకుండా
ఎదిగీ పెద్ద అయ్యారు!!

ముగ్గురు కొడుకుల్లోనా
ముసలితనంలోన తనకు
అండగుండున దెవ్వరను
ఆలోచనతో తుదకు,

తన కొడుకులు వెంటరాగ
చనెనో సాధువు చెంతకు
విన్నవించె తన యోచన
వివరంగా సాధువునకు!!

సాధువు వెంటనె దానికి
సమాధానము కనుగొనగ,
తెచ్చి మూడు అరటి పండ్లు
ఇచ్చె తలా యొకటి తినగ!

పండు తినీ తొక్కలచటే
పారవేసె పెద్దవాడు!
రెండోవాడా తొక్కలు
కుండీలో వేసినాడు!!

ఆఖరు వాడా తొక్కలు
ఆవుకు తినిపించినాడు!
నేర్పుగాను సాధువపుడు
తీర్పు ఇలా చెప్పినాడు,

ఉద్ధరించబోడెవరిని
పెద్దబ్బాయి  మొద్దబ్బాయ్!
మంచోడనిపించుకొన
తపించును రెండో అబ్బాయ్!

చిన్నబ్బారు ఉత్తముడోయ్
చేదోడుగ వాదోడుగ
వృద్ధాప్యంలోన నిన్ను
ఉద్ధరించు నీ వాడుగ!!

– ‘బాలబంధు’
అలపర్తి వెంకట సుబ్బారావు.
94408 05001

➡️