ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌తో కిడ్నీ సమస్యలు..!

May 5,2024 08:33 #Sneha

‘ఈ ఫేస్‌క్రీమ్‌ వాడండి. ఉదయం లేచేటప్పటికి మిమ్మల్ని మీరు గుర్తు పట్టలేనంత తెల్లగా వస్తారు. ఇది వాడండి.. గ్లాసీ స్కిన్‌ మీ సొంతం అవుతుంది. అసలిది వాడితే బంగారం తొడిగినట్లు ఉంటుంది మీ చర్మం. ఇదిగోండి ఇది చూశారూ.. పాదరసమే మీ చర్మం.. అంటూ పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు వింటూ ఉంటాం. అవును అదే పాదరసం దేహంలోని అవయవాలను నిర్వీర్యం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొట్టక్కల్‌లోని ఆస్టర్‌ మిమ్స్‌ ఆస్పత్రికి చెందిన నెఫ్రాలజీ విభాగం వైద్యులు ఈ విషయాన్ని గుర్తించి, పరిశోధనలు చేశారు.

మనదేశంలో.. అందునా దక్షిణాది ప్రాంత ప్రజలు చామనచాయ, నలుపు శరీర రంగును కలిగి ఉండటం కద్దు. దాంతో తెల్లగా కనిపించడానికి ఈ ఫెయిర్‌నెస్‌ క్రీములను విరివిగా వాడుతున్నారు. ఇవి వాడి తెల్లబడిన వారికే మంచి వరుడు దొరుకుతాడనీ.. అలా తెల్లబడిన వారినే ఏరి కోరి వరిస్తారంటూ.. ఆడవాళ్లకే ఫెయిర్‌నెస్‌ కాదు.. ఇప్పుడు మగవాళ్లకు కూడా అంటూ.. వాణిజ్య ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మార్కెట్‌ మాయాజాల మెరుపులకు ప్రధానంగా ఎక్కువమంది యువత ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ క్రీముల తయారీలో వినియోగించే రసాయనాలు మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నాయని కొత్త అధ్యయనాలు తెలుపుతున్నాయి.
నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌..
ఫెయిర్‌నెస్‌ క్రీముల్లో కలిపే రసాయనాల వలన కిడ్నీ సమస్యలు రావటం ఏమిటి..?! మహా అయితే మొహంపై ఎలర్జీ వస్తుందేమోగానీ అనిపిస్తుంది మనకు. కానీ మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు పరిశోధకులు. ఈ క్రీముల్లో మెరిసే లక్షణం కలిగిన పాదరసాన్ని ఎక్కువ మోతాదులో వినియోగించటం వలన, అది కిడ్నీ నిర్వర్తించే వడపోత విధానాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో మెంబ్రానస్‌ నెఫ్రోపతీ (ఎంఎన్‌) అంటారు. అంటే.. మూత్రపిండాల్లోని చిన్న, సన్నని రక్తనాళాలు, వడపోత పొరలు దెబ్బతినటం. సరిగా పనిచేయక పోవటం. మెంబ్రానస్‌ నెఫ్రోపతి బారిన పడిన మూత్రపిండాలు సాధారణంగా ఫిల్టర్‌ చేసే వ్యర్ధాలే కాకుండా.. రక్తంలోని నీరు, ప్రోటీన్‌లను కూడా ఫిల్టర్‌ చేస్తాయని చెబుతున్నారు. అది రానురాను వ్యక్తి తీసుకున్న ఆహారంలోని ప్రోటీన్‌, కణజాలాన్ని చేరకుండానే బయటికి పోయే నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌ వ్యాధికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
కేరళ కొట్టక్కల్‌లోని ఆస్టర్‌ మిమ్స్‌ ఆస్పత్రిలో అరుదైన మూత్రపిండ వ్యాధి ‘మెంబ్రానస్‌ నెఫ్రోపతీ’గా నిర్ధారణ అయింది. ఈ వ్యాధిని మొదట 14 ఏళ్ల బాలికలో గుర్తించారు. ఈమె విషయంలో చాలా రకాల పరీక్షలు చేసినా ఫలితం కనిపించలేదు. ఆమె ఉపయోగించే ప్రతి వస్తువు మీద పరీక్షలు జరిపారు. అదే లక్షణాలతో చికిత్స పొందుతున్న మరికొందరి విషయంలోనూ నిశితంగా దృష్టి కేంద్రీకరించారు.

పాదరసం, సీసం..
ఆస్టర్‌ మిమ్స్‌ సీనియర్‌ నెఫ్రాలజిస్టులు డాక్టర్‌ సజీష్‌ సహదేవన్‌, రెంజిత్‌ నారాయణన్‌ చికిత్స పొందుతున్నవారు ఉపయోగించిన మందులు, ఫేస్‌క్రీమ్‌ల గురించి వివరంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. క్రీమ్‌లపై చేసిన పరీక్షల్లో పాదరసం, సీసం వినియోగించాల్సిన స్థాయి కంటే వంద రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీటిని చర్మం గ్రహించటం ద్వారా కణజాలానికి సరఫరా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఏది ఎంత..?!
ఏ వస్తువులో ఏ పదార్థం ఎంత మోతాదులో వినియోగించాలో రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం పరిధిలో ఉంటుంది. బృందం నిర్వహించిన పరీక్షల్లో పాదరసం, సీసం అనుమతించబడిన మోతాదు కంటే వంద రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. క్రీమ్‌కు సంబంధించిన లేబుల్‌పై ఉత్పత్తి తయారీదారుల సమాచారం గానీ, దానిలో ఉపయోగించిన పదార్థాల గురించిన వివరాలు గానీ లేవు. ‘ఆపరేషన్‌ సౌందర్య’ పేరుతో ఫిబ్రవరిలో రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం నకిలీ కాస్మోటిక్స్‌ను సీజ్‌ చేసింది. అయినా నకిలీ ఉత్పత్తులు పదేపదే మార్కెట్‌లోకి వస్తూనే ఉన్నాయి.
జాగ్రత్తలు..
కొన్ని నకిలీ కంపెనీలు నియంత్రణ అధికారులు సూచించిన భద్రతా మార్గదర్శకాలను అనుసరించడంలేదు. కాస్మెటిక్స్‌ కొనేటప్పుడు అన్ని విషయాలనూ జాగ్రత్తగా గమనించాలి. నిబంధనల ప్రకారం, కాస్మెటిక్‌ ఉత్పత్తుల లేబుల్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ నంబర్‌, తయారీ సంస్థ పేరు, చిరునామా ఇవన్నీ. ఏదేమయినా నేచురల్‌గా అనేక రకాల సౌందర్య సాధనాలున్నాయి. వాటిని ఉపయోగించుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వవు.

➡️