కాపాడుకుందాం

Jun 30,2024 10:02 #chirumuvallu, #Sneha

అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి దగ్గరలో ఒక అడవి ఉండేది. గ్రామంలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రంగయ్య రోజూ పక్కనున్న అడవిలోకి పోయి చెట్లను కొట్టి ఆ కట్టెలను కట్టగట్టుకుని కొద్ది దూరంలో ఉన్న పెద్దపట్నంలో అమ్మేవాడు. కొంతకాలానికి ఆ అడవిలోని చెట్లు తగ్గిపోయాయి. అడవి జంతువులు పంటపొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. ఊర్లోకి వచ్చి ఊరి ప్రజలను భయపెడుతున్నాయి. ఇదిలా ఉండగా ఒకరోజు రంగయ్య గొడ్డలిపట్టుకుని ఇంట్లోంచి బయటపడి నడచుకుంటూ అడవికి బయలుదేరాడు.
దారిలో ఆరవతరగతి చదువుతున్న హర్ష ఎదురుపడ్డాడు. ‘తాతా! ఎటు పోతున్నావు?’ అని అడిగాడు. దానికి రంగయ్య ‘అడివికి పోతున్న బిడ్డా! కట్టెలు కొట్టుకుని పట్నం బోయి అమ్ముకొస్తా!’ అని జవాబిచ్చాడు. అప్పుడు హర్ష ‘ఓ పిచ్చితాతా! అందరూ నీలాగా అడవిలోని చెట్లను కొట్టేయడం వల్లనే అడవిలోని జంతువులు ఊర్లోకి వస్తున్నాయి. చెట్లు కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని మనకు అవసరమైన ఆక్సిజన్‌ను ఇస్తాయని మా సైన్స్‌ సార్‌ చెప్పిండు. మంచిగాలి కావాలంటే చెట్లు ఉండాలి తాతా!’ అన్నాడు. దానికి రంగయ్య ‘బిడ్డా! బడికిపోయి మంచి ముచ్చట్లు నేర్చుకున్నవ్‌! ఇప్పటినుండి నేను చెట్లను కొట్టేయ! ఇంకోళ్ళను కొట్టనియ్య! అవసరానికి కొట్టినా కొత్తగా ఒకటికి రెండు చెట్లను బెంచుతా!’ అని హర్షను దగ్గరకు తీసుకున్నాడు.

ముస్త్యాల దినకర్‌ 6వ తరగతి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,
 నరసాయపల్లి, మద్దూర్‌, సిద్ధిపేట.

➡️