మహిళాభ్యున్నతిలో ఎందరో మగానుభావులు

Many men are involved in women's development article

సమాజంలో అసమానత, అణచివేత, అన్యాయం ఎక్కడ, ఏ దశలో కనిపించినా దాని గురించి పట్టించుకోవడం, ప్రశ్నించటం, మార్పు కోసం ప్రయత్నించటం మొదటి నుంచీ ఉంది. ఆధునిక కాలం అవతరించాక, ఇతర సమాజాల నుంచి ఉదాత్త భావనలు భారతీయ సమాజంలోకి ప్రవహించటం మొదలయ్యాక – ఈ ధోరణి మరింత పెరిగింది. సాంప్రదాయాల పేరిట, సంస్క ృతి పేరిట మహిళల మీద సాగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా అనేకమంది మాట్లాడ్డం మొదలు పెట్టారు. ఉద్యమాలు నడిపారు.

 

  • రాజా రామ్మోహనరాయ్ :

భర్త చనిపోతే అతడితో పాటే బతికి ఉన్న భార్య కూడా చితిలోకి సహగమనం చేయాలనేది కొన్ని కులాల్లో ఒకనాటి దురాచారం. దానిని గట్టిగా వ్యతిరేకించిన వాడు రాజా రామ్మోహనరారు. వేదాలను, ఉపనిషత్తులను విశ్వసిస్తూనే- మూఢ నమ్మకాలను, దురాచారాలనూ, కర్మకాండలను తీవ్రంగా వ్యతిరేకించాడు. వితంతు పునర్వివాహాలను సమర్ధించాడు. బాల్య వివాహాలను, బహు భార్యత్వాన్ని నిరసించాడు. స్త్రీలకు ఆస్తిహక్కు ఉండాలని, బాలికలకు విద్య అందించాలని పోరాడాడు. అప్పటి బ్రిటీషు పాలకుల హయాంలో కొన్ని మహిళా అనుకూల చట్టాలు రావటానికి కారణమయ్యాడు.

  • కందుకూరి వీరేశలింగం :

తెలుగు నాట సంఘ సంస్కరణ ఉద్యమాన్ని బలంగా నడిపాడు కందుకూరి. వితంతు పునర్వివాహాలు జరిపించాడు. బాలికల కోసం విద్యాసంస్థలను ఏర్పరిచాడు. తోటి కులస్తులు ఆయన్ని ఎగతాళి చేసినా, వెలివేసినా, దాడులు చేసినా వెనకడుగు వేయలేదు. భార్య రాజ్యలక్ష్మమ్మ ఆయనకు వెన్నంటి నిలిచారు. ఎంతోమంది వితంతువులకు, బాలికలకు తమ ఇంట్లో ఆశ్రయం కల్పించారు. వీరేశలింగం ఇటు సంఘ సంస్కరణ ఉద్యమాల ద్వారా, అటు సాహిత్య సృజన ద్వారా, పత్రికా రచన ద్వారా సమాజ ఉద్ధరణకు కృషి చేశారు.

  • జ్యోతిరావు ఫూలే :

బాలికా విద్యను ఒక ఉద్యమంలా సాగించాడు జ్యోతిరావు ఫూలే. సమాజంలోని ఆధిపత్య వర్గాల అవహేళనలను, దాడులను ఎదుర్కొని ముందుకు సాగాడు. స్త్రీలకు పురుషులతో పాటే సమాన హక్కులు ఉండాలని చెప్పాడు. తన భార్య సావిత్రికి చదువు నేర్పించి, ఉద్యమంలో ముందుకు నడిపాడు. సావిత్రిభాయి ఫూలే మన దేశ తొలి ఉపాధ్యాయురాలిగా బాలికావిద్యను ఎంతో ప్రోత్సహించారు. 100కు పైగా బాలికా పాఠశాలలను నెలకొల్పి ఎంతోమందిని విద్యావంతులను చేశారు.

 

  • ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ :

మనదేశంలో విద్యాలయాల స్థాపనకు ఎంతో కృషి చేశారు. స్త్రీ పునర్వివాహం తప్పు కాదని, అది ధర్మబద్ధమేనని నిరూపిస్తూ ఒక పుస్తకం రాశాడు. పునర్వివాహం చేసుకున్న హిందూ స్త్రీకి ఆస్తిహక్కు పోదనే చట్టం అతడి కృషి ద్వారానే బ్రిటీషు ప్రభుత్వం తీసుకొచ్చింది. తన కుమారుడికి ఒక వితంతు బాలికతో వివాహం జరిపించిన ఆచరణవాది ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌.

dayananda saraswathi

  • దయానంద సరస్వతి :

హిందూమతంలో చెల్లుబాటు కాని సాంప్రదాయాలు పోవాలని, సంస్కరణలు తేవాలని పాటుపడ్డాడు. 1875లో ఆర్యసమాజాన్ని నెలకొల్పాడు. వర్ణ వ్యవస్థను, బాల్యవివాహాలను, విగ్రహారాధననూ వ్యతిరేకించాడు. స్త్రీవిద్య, స్త్రీ పునర్వివాహం శాస్త్రసమ్మతమేనని వివరించాడు.

  • గురజాడ అప్పారావు :

తెలుగు నాట సాహిత్యం ఆధునిక రూపం తీసుకుంటున్న తొలి దశలోనే దానికి ప్రయోగం రీత్యా, ప్రయోజనం రీత్యా అభ్యుదయం జోడించిన మహాకవి. ఆయన తొలికథ ‘దిద్దుబాటు’, బృహత్తర నాటకం ‘కన్యాశుల్కం’, ఇతర గేయకథలూ స్త్రీ జనోద్ధరణ ప్రధానంగా సాగాయి. స్త్రీ పురుషుల సమానత్వం గురించి గొప్పగా ఉద్బోధించారు. మగడనగా వేల్పు అనేది పాత భావన అని, స్నేహితుడు అనేది సరికొత్త భావన అని నిర్వహించాడు. ఆయన అసంపూర్ణ నవల ‘సౌధామిని’లో స్త్రీలు రక్షణ విద్యలు నేర్చుకోవాలని ప్రతిపాదించాడు.

ఇంకా ఎందరో కవులూ రచయితలూ సంఘసంస్కర్తలూ మహిళా హక్కుల కోసం, విద్యావికాసం కోసం పాటుపడ్డారు. మన రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ … చట్టాల్లో మహిళాహక్కులకు చోటు కల్పించారు. పెరియార్‌ రామస్వామి, నారాయణ గురు, కేశవ్‌ చంద్రసేన్‌, సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ వంటి వారు ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. స్త్రీవిద్య కోసం, విముక్తి కోసం తోడ్పడ్డారు. తరువాత ఎందరెందరో దానిని కొనసాగించారు. అలాంటి అభ్యుదయ మార్గాన్ని మళ్లీ వెనక్కి నెట్టేందుకు కొన్ని ప్రతీఘాత శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటిని తిప్పికొడుతూ, ఉమ్మడిగా మున్ముందుకు సాగిపోవటం నేడు అందరి కర్తవ్యం.

– శాంతిమిత్ర

➡️