జాడలేని వసంతం..

Mar 31,2024 08:22 #drinking water, #Science, #Sneha

భౌగోళిక, సామాజిక-సాంస్కృతిక పర్యావరణ పరిస్థితులపై జీవరాశి ఆధారపడి ఉంటుంది. నీరు పర్యావరణ చక్రంలో కీలకం. సమాజాలు, వాటి జీవనశైలి, ప్రపంచ దృక్పథాలు పరిమితిలేని మార్పు వచ్చినప్పుడు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇప్పుడు మన దేశంలో ఎదురైన కాలాలు కనుమరుగయ్యే అనూహ్య పరిస్థితులను నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వసంతకాల జాడలే కనుమరుగయినట్లు, అమెరికాకు చెందిన కేంద్ర వాతావరణ పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది. 1970 నుంచి పరిశోధకులు ఉష్ణోగ్రత డేటా ఆధారంగా మనదేశ గ్లోబల్‌ వార్మింగ్‌ను విశ్లేషించారు. ఈ ఏడాది జనవరి నెలలోనే ఉత్తర భారతదేశంలో కొన్ని రోజులు చలి.. ఆ తర్వాత తేలికపాటి వేడి కనిపించింది. అలాగే ఫిబ్రవరి నెలలో అంటే చలికాలంలో ఉక్కపోత, వేసవి కాలపు వేడి నెలకొన్నది. అంతేకాక వసంత రుతువు వ్యవధి క్రమంగా తగ్గిపోతూ చివరికి కనుమరుగవుతోందని హెచ్చరిస్తోంది..

కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ (C3S).. అంటే ప్రపంచంలోని గతం, వర్తమానం, భవిష్యత్తుల్లో వాతావరణ అధికారిక సమాచారాన్ని అందించే సూచిక. భూ ఉపరితల, సముద్రం లోపల జరిగే పర్యావరణ మార్పుల సమాచారాన్ని సేకరించి, విశ్లేషణాత్మక డేటాను విడుదల చేస్తుంది. ఈ లెక్కలను ‘ఇన్‌-సిటు’ సెన్సార్ల కొలతలుగా చెబుతారు. వీటి సేకరణ ఉపగ్రహాల ద్వారా జరుగుతుంది. ఈ వివరణలు వాతావరణ మార్పుల హెచ్చుతగ్గులను సూచిస్తాయి. ఈ సూచనల మేరకు మన దేశంలో సాధారణంగా రావలసిన వసంత కాలం (మార్చి, ఏప్రిల్‌లో వచ్చే వసంత ఋతువు) మానవాళికి కనిపించకుండా కాలాన్ని అధిగమించినట్లు క్లైమేట్‌ సెంట్రల్‌లోని సైన్స్‌ అధ్యయనకర్త ఆండ్రూ పెర్షింగ్‌ అన్నారు.

పారిస్‌ ఒప్పందం..
ప్రమాదకరమైన వాతావరణ మార్పులను ఆపడానికి ప్రపంచ దేశాల మధ్య, 2015లో పారిస్‌ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం, గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం.. కనీసం రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉండేలా ప్రపంచ దేశాలు బాధ్యత వహించాలనేది ఈ ఒప్పందం సారాంశం. దీనికి దేశాలన్నీ అంగీకరించాయి. కానీ ఈ సంవత్సరం జనవరిలో మొదటిసారి పారిస్‌ ఒప్పందం ఉల్లంఘన జరిగిందని డేటా రుజువు చేసింది. దీనికి కారణం గ్లోబల్‌ వార్మింగ్‌ అని పరిశోధకుల వివరణ.


శిలాజ ఇంధన కారణాలు..
బొగ్గు, చమురు, సహజ వాయువుల వంటి శిలాజ ఇంధనాల వినియోగంలో వెలువడే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు వాతావరణంలో పెరగడమే భూమి వేడెక్కడానికి ప్రధానకారణం.. దీనినే కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. వాతావరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదల కావడానికి పారిశ్రామిక విప్లవం గణనీయంగా దోహదపడింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదు చేయబడిన ఉష్ణోగ్రతల పట్టికలో.. 1850ల నుండి సగటు ఉష్ణోగ్రతలు 1.3 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి. అలా పెరుగుతూ వచ్చిన ఉష్ణోగ్రత 2023 నాటికి తీవ్రస్థాయికి చేరినట్లు రికార్డుల్లో నమోదైంది. అధ్యయనం ప్రకారంఈ సంవత్సరం రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, లడఖ్‌, పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ మొత్తం తొమ్మిది రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ రెండు నెలల్లోనూ రెండు డిగ్రీల సెల్సియస్‌ను మించిన ఉష్ణోగ్రత నమోదయ్యింది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్‌లో 2.3 డిగ్రీల సెల్సియస్‌ ఉండగా, సిక్కింలో 2.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. రాజస్థాన్‌లో 2.6 డిగ్రీల సెల్సియస్‌ కనిపించింది. ‘దీన్నిబట్టి దేశమంతటా వేసవి-ఉష్ణోగ్రతలు కూడా ముందుగానే ప్రారంభమవుతాయి’ అని పెర్షింగ్‌ చెప్పారు.

కనుమరుగైన వసంతం..
వసంత ఋతువు సాంస్కృతికంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పు వల్లనే ఈ సంవత్సరం వసంతకాలం కనుమరుగైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే శతాబ్ది చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది జీవరాశులకు పెనుముప్పు అని వారు హెచ్చరిస్తున్నారు. మానవ కార్యకలాపాలకు పరిమితి లేని కారణంగానే వేగంగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయని అన్నారు. ఇలా జరగటం ప్రకృతిపరంగా జరిగే కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రపంచంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలంటే 2030 నాటికి కర్బన ఉద్గారాలను 43 శాతం తగ్గించాలని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

➡️