లైంగిక దాడుల నేరస్తులకు బిజెపి అండదండలు

May 8,2024 09:56 #sexual assault

మోడీ పాలనలో మహిళలపై పెరిగిన హింస
న్యూఢిల్లీ : బిజెపి పాలనలో మహిళలపై హింస మరింతగా పెరిగిపోయింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించిన 134 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో బిజెపి ప్రజాప్రతినిధుల సంఖ్యే అధికంగా (44) ఉంది. అత్యాచారాలు, వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ కల్పించడంలో బిజెపి ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. బిజెపి వెబ్‌సైట్‌ చూస్తే అందులో నారీశక్తి ప్రస్తావన పదేపదే కన్పిస్తుంది. మహిళలపై వివక్షను తొలగించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. బాలికలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఉద్బోధిస్తుంది. కానీ ఇవి మాటలకే పరిమితం… బిజెపి నేతలు తరచుగా తమ మహిళా సహచరులను కించపరిచే వ్యాఖ్యలతో నొప్పిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్న మహిళా నేతలను కూడా వారు వదిలిపెట్టరు.
ప్రధాని సైతం…
సాక్షాత్తూ ప్రధాని మోడీ 2018లో రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీని ఉద్దేశించి ‘వితంతువు’ అని సంబోధించారు. రాజకీయ నాయకుల కుటుంబాలను కూడా ఆయన వదలలేదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు చెందిన త్రివేండ్రం ఎంపీ శశిథరూర్‌ భార్య సునందా పుష్కర్‌ను ‘యాభై కోట్ల రూపాయల గర్ల్‌ ఫ్రండ్‌’ అంటూ కించపరిచారు.
దేశంలో మహిళలపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. 2021లో 60 లక్షల నేరాలు నమోదు కాగా వాటిలో 4,28,278 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించినవే. 2016లో ఈ తరహా నేరాలు 3,38,954 నమోదయ్యాయి. అంటే ఆరు సంవత్సరాల వ్యవధిలో మహిళలపై నేరాల కేసులు 26.35 శాతం పెరిగాయి. అదేవిధంగా జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2015-2020 మధ్యకాలంలో దళిత మహిళలపై లైంగికదాడుల కేసుల సంఖ్య 45 శాతం పెరిగింది. దీనిని బట్టి చూస్తే ప్రతి రోజూ దేశంలో దళిత మహిళలు, బాలికలపై అత్యాచారాలకు సంబంధించి 10 కేసులు నమోదవుతున్నాయి. ఈ అకృత్యాలలో బిజెపి, దాని మిత్రపక్షాల నాయకుల పాత్ర ఎంత?
వీరంతా ఎన్‌డిఎ నాయకులే
ఇటీవల కర్నాటకలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఉదంతాన్ని తీసుకుందాం. ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షమైన జెడిఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దాడులకు సంబంధించి మూడు వేల వీడియో టేపులు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆయన దేశాన్ని విడిచి పారిపోయారు. ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సహా పలువురు బిజెపి నేతలపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌, రాందులార్‌ గోండ్‌ తదితరులు ప్రస్తుతం కారాగారంలో ఉన్నారు.
తలవంపులు తెచ్చిన హత్రాస్‌ ఘటన
మహిళలపై అఘాయిత్యాలు, లైంగికదాడులు జరుగుతున్నప్పటికీ బిజెపి స్పందన అంతంతమాత్రంగానే ఉంటోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత యువతిపై లైంగికదాడి, హత్యకు సంబంధించిన హత్రాస్‌ కేసులో ఆ పార్టీ వైఖరి దీనికి అద్దం పడుతోంది. 2020లో దళిత బాలికపై అగ్రకుల ఠాకూర్‌ వర్గానికి చెందిన నలుగురు కామాంధులు దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ బాలిక కుటుంబసభ్యులకు బెదిరింపులు అధికమయ్యాయి. చివరికి ఆమె మృతదేహాన్ని దహనం చేసేందుకు కూడా కుటుంబసభ్యులను అనుమతించలేదు. రాత్రికి రాత్రే ఆ మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా దహనం చేశారు. కేసు విచారణ సమయంలో సాక్షులను కూడా బెదిరించారు. భయపెట్టారు. చివరికి కేసులో ఒకే ఒక వ్యక్తికి శిక్ష పడింది. నలుగురు నిర్దోషులుగా బయటపడ్డారు. చనిపోవడానికి ముందు ఆ బాలిక మెజిస్ట్రేట్‌ ఎదుట నలుగురు కామాంధులకు వ్యతిరేకంగా మరణవాంగ్మూలం ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. హత్రాస్‌ ఘటనపై వార్తలు అందించేందుకు ఇద్దరు పాత్రికేయులు, ఒక ట్యాక్సీ డ్రైవర్‌ సహా ముగ్గురు ముస్లింలు ప్రయత్నించగా వారిని అరెస్ట్‌ చేసి మూడు సంవత్సరాల పాటు జైలులో ఉంచారు. పైగా ఈ ఉదంతాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. అసలు దళిత బాలికపై అత్యాచారమే జరగలేదని విదేశీ మీడియాలో కథనాలు వచ్చేలా ప్రజాసంబంధాల సంస్థలను ఉపయోగించుకుంది. మొత్తంమీద హత్రాస్‌ ఘటన దేశానికే తలవంపులు తెచ్చింది.
కామాంధులకు అండ..దండ
2002లో గుజరాత్‌లో జరిగిన మారణహోమం సందర్భంగా జరిగిన బిల్కిస్‌ బానో కేసును గుర్తుకు తెచ్చుకుందాం. బిల్కిస్‌పై పైశాచికంగా అత్యాచారం జరిపిన కామాంధులకు న్యాయస్థానం జైలుశిక్ష విధించగా, గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. అయితే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీనికి ముందు జైలు నుండి విడుదలైన రేపిస్టులకు వీహెచ్‌పీ పూలదండలు, మిఠాయిలతో స్వాగతం పలికింది. గత సంవత్సరం గుజరాత్‌లో ఈ దుండగులు బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. మూడు సంవత్సరాల కుమార్తె సహా ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హతమార్చారు. బిల్కిస్‌ బానో ఉదంతాన్ని పరిశీలిస్తే అత్యాచారాలకు పాల్పడిన వారికి బిజెపి, సంఫ్‌ు పరివార్‌ ఏ విధంగా కొమ్ము కాస్తున్నాయో అర్థమవుతుంది.

➡️