ప్రయివేటు పెట్టుబడులు డీలా

May 8,2024 10:30 #Business

2022-23లో 36 శాతానికి పతనం
కోవిడ్‌ నాటి కనిష్ట స్థాయికి క్షీణత
నేషనల్‌ అకౌంట్స్‌ స్టాటిస్టిక్స్‌ గణంకాల వెల్లడి
న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు దూసుకుపోతున్నాయని.. మరోమారు మోడీ సర్కార్‌ అధికారంలోకి వస్తే మరింత అభివృద్థిని చూపెడుతామని ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బిజెపి చేస్తున్న విస్తృత ప్రచారానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు కోవిడ్‌ నాటి స్థాయికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఆర్థిక సంవత్సరం 2022-23లో ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ రంగంలో ప్రయివేటు పెట్టుబడుల వాటా 36.2 శాతానికి క్షీణించిందని నేషనల్‌ అకౌంట్స్‌ స్టాటిస్టిక్స్‌ గణంకాల్లో తేలింది. ఇంతక్రితం ఏడాది 2021ా22లోనూ 36.3 శాతంగా ఉంది. ఏడాదికేడాదితో పోల్చితే 2022-23లో ప్రయివేటు ఫైనాన్సీయల్‌ కార్పొరేషన్స్‌ పెట్టుబడుల్లోనూ 0.7 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ప్రభుత్వ ఫైనాన్స్‌యేతర లేదా ప్రభుత్వ రంగ కంపెనీల పెట్టుబడుల వాటా 9.4 శాతానికి తగ్గింది. ఇంతక్రితం 2021-22లో పిఎస్‌యుల పెట్టుబడులు 9.5 శాతంతో పోల్చితే స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది.
ఉత్పత్తి రంగంలో పిఎస్‌యుల పెట్టుబడుల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఈ విభాగంలో పిఎస్‌యుల వాటా వరుసగా 2018-19, 2019-20, 2020-21లో వరుసగా 9.7 శాతం, 10.2 శాతం, 11.6 శాతం చొప్పున పెరిగుతూ వచ్చింది. 2022-23లోనూ రియల్‌ ఎస్టేట్‌లో ప్రభుత్వ వాటా 13 శాతానికి పెరిగింది. ఇంతక్రితం 2021-22లో 12 శాతంగా ఉంది. 2023-24లోనూ ప్రయివేటు రంగ పెట్టుబడులు 15.3 శాతం క్షీణించాయని ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రాకింగ్‌ సంస్థ ప్రాజెక్ట్స్‌ టుడే ఓ రిపోర్ట్‌లో తెలిపింది. విదేశీ పెట్టుబడిదారులు కూడా దాదాపు మూడింట ఒక వంతు కొత్త ఖర్చులను తగ్గించారని తెలిపింది. దీని ఫలితంగా 2022-23లో నమోదైన దాదాపు రూ.37 లక్షల కోట్లతో పోలిస్తే కొత్త పెట్టుబడుల ప్రకటనల విలువ దాదాపు 5 శాతం తగ్గింది. తయారీ రంగంలో ప్రయివేటు రంగ పెట్టుబడి ప్రణాళికలలో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. ఇందులో ప్రతిపాదిత వ్యయాలు 2022-23లో రూ.19.85 లక్షల కోట్లతో పోల్చితే.. 2023-24 నాటికి రూ.11.9 లక్షల కోట్లకు పడిపోయాయని ‘ది హిందూ’ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. 2022-23లో తయారీ రంగంలో కొత్త పెట్టుబడులు దాదాపు 54 శాతం మేర తగ్గాయి. నీటిపారుదల, మైనింగ్‌లో పెట్టుబడులు వరుసగా 48.7 శాతం, 19.25 శాతం చొప్పున క్షీణించాయి. పెట్టుబడుల ద్వారానే కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతాయి. దేశంలో ప్రజల ఆదాయాలు తగ్గడంతో సరుకులకు డిమాండ్‌ పడిపోవడంతో కంపెనీలు తమ విస్తరణ కార్యకలాపాలను తగ్గించుకుంటున్నాయి. దీంతో దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. ఓ వైపు పెట్టుబడుల్లో పతనం, మరోవైపు నిరుద్యోగం ఎగిసిపడుతోన్నప్పటికీ.. దేశం దూసుకుపోతోందని మోడీ సర్కార్‌ చేస్తున్న ప్రచారం విమర్శలకు దారి తీస్తోంది.

➡️