కృష్ణాలో హోరాహోరీ!

  • పట్టుకోసం వైసిపి, విపక్ష పార్టీల యత్నాలు
  • ప్రభుత్వంపై వివిధ తరగతుల్లో వ్యతిరేకత
  • ఫలితాలపై ప్రభావం చూపనున్నఇండియా వేదిక అభ్యర్థులు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాలకూ ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గత ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తడంతో మచిలీపట్నం పార్లమెంటుతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల వైసిపి విజయం సాధించింది. టిడిపి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే వైసిపితో జతకట్టారు. ప్రభుత్వంపై వివిధ తరగతుల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని టిడిపి, జనసేన, బిజెపి కూటమి భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు తోడు బందరులో పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాలు ఏడాది క్రితం ప్రారంభించడం, మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టి దానిని వేగంగా పూర్తి చేసి ప్రారంభించడం వంటి కార్యక్రమాలు తమను తిరిగి గెలిపిస్తాయని అధికార వైసిపి అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇండియా వేదిక అభ్యర్థులకు పడే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. పామర్రు, మచిలీపట్నం అసెంబ్లీ నియోకవర్గాల్లో ఇండియా వేదిక నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గన్నవరం నుంచి సిపిఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారు.

రాజకీయ పార్టీల అభ్యర్థులు వీరే…
మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధికార వైసిపి అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్‌, టిడిపి, బిజెపి బలపరిచిన జనసేన అభ్యర్థిగా సిట్టింగు ఎంపి వల్లభనేని బాలశౌరి పేర్లను ఆయా పార్టీల అధిష్టానాలు ప్రకటించాయి. ఇండియా వేదిక నుంచి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు సింహాద్రి చంద్రశేఖర్‌ తొలిసారి ఎన్నిక బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన బాలశౌరి ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా రంగంలో దిగారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్‌ మతీన్‌ పోటీ చేస్తున్నారు. పెడనలో వైసిపి నుంచి జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాము, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శొంఠి నాగరాజు పోటీలో ఉన్నారు. అవనిగడ్డలో వైసిపి అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌, జనసేన అభ్యర్థిగా మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అందే శ్రీరామ్మూర్తి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టిడిపి నుంచి ఇటీవల జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌కు పవన్‌కల్యాణ్‌ టికెట్‌ కేటాయించడాన్ని ఆ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు జీర్ణించు కోలేకపోతున్నాయి. పామర్రులో వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, టిడిపి అభ్యర్థిగా వర్ల కుమార్‌ రాజా, ఇండియా వేదిక నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా డివై దాస్‌ రంగంలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ ఎప్పుడూ టిడిపి గెలుపొందలేదు.
టిడిపి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతలోనూ గత ఎన్నికల్లో గన్నవరం నుంచి ఆ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ స్వల్ప ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో గన్నవరం నుంచి వంశీమోహన్‌ వైసిపి అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఓటమిపాలయ్యారు. కొద్దికాలం తర్వాత టిడిపిలో చేరిన ఆయన ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇండియా వేదిక నుంచి సిపిఎం పోటీ చేస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ డబ్బులను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెడుతున్నారు. పెనమలూరు నుంచి అధికార వైసిపి అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్‌, టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎలిసల సుబ్రమణ్యం పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పెనమలూరు నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టిడిపిలో చేరారు. ఈసారి ఆయన నూజివీడు నుంచి బరిలో నిలిచారు. దీంతో, వైసిపి అధిస్టానం జోగి రమేష్‌ను పెడన నుండి తీసుకొచ్చి ఇక్కడ పోటీకి పెట్టింది. గుడివాడ నుంచి వైసిపి అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే కొడాలి నాని, టిడిపి అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము, కాంగ్రెస్‌ అభ్యర్థిగా వడ్డాది గోవిందరావు (రాజేష్‌) పోటీ చేయనున్నారు. గుడివాడలో ఈసారి గట్టి పోటీ నెలకొంది.

3 నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లు కీలకం
కృష్ణా జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీల ఓట్లు కీలకం కానున్నాయి. పెనమలూరులో 38 వేలు, మచిలీపట్నంలో 19 వేలు, గుడివాడలో 10 వేలకుపైగా ముస్లిం మైనార్టీల ఓట్లు ఉన్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల వివక్షతో కూడిన సిఎఎను అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిజెపితో పొత్తు కారణంగా ముస్లిం మైనార్టీల ఓట్లు దూరమవుతాయని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉయ్యూరులో జరిగిన సభలో టిడిపి అధినేత చంద్రబాబు… ముస్లిం మైనార్టీలకు టిడిపి అండగా ఉంటుందని ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.

➡️