యుద్ధ జ్వరంతో ఇజ్రాయెల్‌

Mar 22,2024 11:38 #fever, #Israel, #War
  • గాజాలో దాడులు ఉధృతం
  • వారంలో 10 మంది వాలంటీర్లు మృతి
  • సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు : ప్రపంచ బ్యాంక్‌

గాజా సిటీ : పాలస్తీనా భూభాగానికి సహాయాన్ని ఇజ్రాయిల్‌ ఒకవైపు అడ్డుకుంటూ, మరో వైపు దాడులను తీవ్రతరం చేసింది, ఉత్తర గాజాలో దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఆహారం, మందులు లేక ఆకలితో అలమటిస్తున్నారని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్‌ ఒక వారంలో అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తున్న 100 మంది వలంటీర్లను చంపేసింది. దీంతో సహాయం అందక గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.ఆసుపత్రుల్లో చికిత్స అందకపోవడం, ఆహార లేమితో పలువురు పిల్లలు చనిపోతున్న హృదయ విదారక పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్‌ ఆసుపత్రులు, జనాభా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ బాంబుదాడులు సాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 13,450 మంది చిన్నారులు చనిపోయినట్లు యూనిసెఫ్‌ వెల్లడించింది. ఇది నాలుగేళ్లలో ప్రపంచంలో చనిపోయిన మొత్తం శిశువుల సంఖ్య కంటే ఎక్కువ.
బుధవారం గాజా నగరంలోని అల్‌-షిఫా ఆసుపత్రిపై జరిగిన దాడిలో పిల్లలతో సహా 90 మంది మరణించారు. ఈ ఆసుపత్రిపై ఇలా దాడి చేయడం ఇది నాలుగోసారి అల్‌ జజీరా టీవీ తెలిపింది. గాయాలతో, ఆకలితో, అర్ధాకలితో ఆస్పత్రికి తీసుకొచ్చే పసికందులకు నొప్పి నివారణ మాత్రలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గాజాలో గడచిన 24 గంటల్లో మరో 104 మంది చనిపోయారు. అక్టోబరు 7, 2023 నుండి ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ దాడుల్లో 32 వేల మందికిపైగా పాలస్తీనీయులు చనిపోయారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 23 లక్షల మంది గాజన్లలో దాదాపు సగం మంది తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారు. గాజాలోని ఆరోగ్య కేంద్రాలపై ఇజ్రాయెల్‌ 410 సార్లు దాడి చేసిందని, ఈ దాడుల్లో 685 మంది ఆరోగ్య కార్యకర్తలు మరణించగా, . 104 అంబులెన్స్‌లు ధ్వంసమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వెల్లడించింది.కాల్పుల విరమణ చర్చలు ఎక్కడా లేవు

కాల్పుల విరమణ పై దోహాలో చర్చలు
గాజా కాల్పుల విరమణ మరియు బందీల విడుదలపై మధ్యవర్తిత్వ చర్చలు దోహాలో కొనసాగుతున్నాయి. చర్చకు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత, మొస్సాద్‌ చీఫ్‌ డేవిడ్‌ బర్నియాతో సహా ఒక బందం దోహాకు చేరుకుంది. తాత్కాలిక కాల్పుల విరమణ, గాజాకు మరింత సాయం వీటి ఆధారంగానే చర్చలు జరుగుతున్నాయని ఖతార్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మజిద్‌ అల్‌ అన్సారీ స్పందించారు. అయితే హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని ఇజ్రాయెల్‌ గట్టిగా చెబుతోంది.

➡️