పార్టీల ఎన్నికల వ్యయానికి పగ్గాల్లేవ్‌!

Apr 12,2024 08:02 #BJP, #Electoral Bonds
  • సగానికి పైగా వాటా బిజెపిదే
  • ఎన్నికల బాండ్లు ఓ పెద్ద స్కాము

ఢిల్లీ: దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. కోట్ల రూపాయల్లో అయ్యే ఖర్చును భరించడం సామాన్యులకు సాధ్యం కాదు. ప్రతి సారి ఎన్నికల వ్యయం పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఎన్నికల కమిషన్‌ అందజేసిన సమాచారం ప్రకారం 2013-14, 2022-23 మధ్యకాలంలో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కలిపి రూ.15,647 కోట్లు ఖర్చు చేశాయి. ఇది ఇసికి వివిధ పార్టీలు సమర్పించిన లెక్కల్లో చూపిన వ్యయం మాత్రమే. వాస్తవానికి దీనికి అనేక రెట్లు అధికంగా ఖర్చయింది. పోనీ అధికారిక లెక్కలనే తీసుకున్నా రాజకీయ పార్టీలన్నీ కలిసి పెట్టిన ఖర్చులో ఒక్క బిజెపి వాటాయే 55 శాతంగా ఉంది. కాంగ్రెస్‌ 30 శాతం, సిపిఐ (ఎం) ఆరు శాతం ఖర్చుతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
లోక్‌సభ ఎన్నికల్లో డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. 2013-14లో అన్ని పార్టీల ఎన్నికల వ్యయంలో బిజెపి వాటా 29 శాతంగా ఉంది. 2014-15 నాటికి వచ్చేసరికి ఇది 48 శాతానికి, 2019-20లో 53 శాతానికి, 2022-23లో 66 శాతానికి చేరుకుంది. ఎన్నికల వ్యయంలో కాంగ్రెస్‌ వాటా 2013-14లో 58 శాతంగా ఉండగా, 2014-15లో 40 శాతం, 2019-20లో 32 శాతం, 2022-23లో 22 శాతానికి పడిపోయింది.

పార్టీల వ్యయంపై పరిమితి లేదు
2019-20లో రాజకీయ పార్టీలు గరిష్ట స్థాయిలో అంటే రూ.3,073 కోట్లు దాకా ఖర్చు చేశాయి. ఇదొక రికార్డు. దేశంలో రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయంపై ఎన్నికల సంఘం ఎలాంటి పరిమితి విధించ లేదు. అభ్యర్థుల ఖర్చుపైనే పరిమితి విధించింది.. చట్టంలోని ఈ లొసుగులనే పార్టీలు అవకాశంగా తీసుకున్నాయి.
ఎన్నికల ప్రచారం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. మొత్తం వ్యయంలో ఈ ప్రచార వ్యయమే అధికంగా ఉంటుంది.

ఎన్నికల బాండ్లు అతి పెద్ద స్కాము
మోడీ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల స్కీము అతి పెద్ద స్కాముగా మారింది. కార్పొరేట్‌ సంస్థలు పెద్ద మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేశాయి. బిజెపి 2014 ఎన్నికల్లో మీడియా ప్రకటనల కోసం రూ.342.5 కోట్లు ఖర్చు చేస్తే, 2019 నాటికి ఆ ఖర్చు రూ.460.8 కోట్లకు పెరిగింది. పర్యటనల వ్యయం రూ.160.2 కోట్ల నుండి రూ.248 కోట్లకు, ఇతర ఖర్చులు రూ.6.7 కోట్ల నుండి రూ.201.5 కోట్లకు పెరిగాయి. ప్రచార వ్యయం రూ.32 కోట్ల నుండి రూ.83 కోట్లకు, ఇతర పార్టీలకు ఇచ్చిన డబ్బు రూ.0.2 కోట్ల నుండి రూ.73.7 కోట్లకు పెరిగింది. ర్యాలీల ఖర్చు మాత్రం రూ.89.5 కోట్ల నుండి రూ.47.7 కోట్లకు తగ్గింది. పార్టీ అభ్యర్థుల ఖర్చు రూ.83.1 కోట్ల నుండి రూ.149.1 కోట్లకు పెరిగింది.

కాంగ్రెస్‌ వ్యయం ఇలా…
అదే సమయంలో కాంగ్రెస్‌ వ్యయం రూ.516 కోట్ల నుండి రూ.820 కోట్లకు పెరిగింది. కాంగ్రెస్‌ మీడియా ప్రకటనలపై ఖర్చు రూ.289.1 కోట్ల నుండి రూ.411.9 కోట్లకు, పర్యటనల వ్యయం రూ.121.1 కోట్ల నుండి రూ.127.8 కోట్లకు, ఇతర ఖర్చులు రూ.19 కోట్ల నుండి రూ.22.2 కోట్లకు పెరిగాయి. ప్రచార వ్యయం రూ.24.2 కోట్ల నుండి రూ.58.6 కోట్లకు పెరగ్గా, ర్యాలీల ఖర్చు మాత్రం రూ.33.07 కోట్ల నుండి రూ.6.2 కోట్లకు తగ్గింది. పార్టీ అభ్యర్థుల ఖర్చు రూ.29.6 కోట్ల నుండి రూ.194 కోట్లకు పెరిగింది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం పెట్టే వ్యయంలో 10.2 శాతం పెరగుదల ఉండవచ్చునని మీడియా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ గ్రూప్‌ ఎం అంచనా వేసింది.

➡️