గిల్‌, పంత్‌లకు జరిమానా

May 11,2024 23:15 #Sports

ముంబయి: గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్లు జరిమానాకు గురయ్యారు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు రూ.24 లక్షల జరిమానా వేటు పడింది. అలాగే జట్టులోని సభ్యులకూ మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం అంటే.. రూ.6 లక్షల వరకు ఫైన్‌ వేస్తున్నట్లు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కమిటీ శనివారం తెలిపింది. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్‌ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక ఢిల్లీ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై ఒక మ్యాచ్‌ వేటు పడింది. ఈమేరకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరుతో ఆదివారం (మే 12న) తలపడనున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామం ఢిల్లీకి ఇబ్బందికరంగా మారనుంది. ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌తోపాటు రిషభ్‌ పంత్‌కు రూ.30 లక్షల జరిమానా విధించడం గమనార్హం. జట్టులోని మిగతా సభ్యులకూ భారీగా ఫైన్‌ పడింది. జట్టు ఆటగాళ్లు ఒక్కొక్కరు రూ.12 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజ్‌లో 50 శాతం.. వీటిల్లో ఏది తక్కువైతే దానిని ఫైన్‌గా కట్టాలి. ఐపిఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ 8 ప్రకారం ఢిల్లీ జట్టు మ్యాచ్‌ రిఫరీ నిర్ణయాన్ని సవాల్‌ చేసింది. బిసిసిఐ అంబుడ్స్‌మన్‌ రివ్యూను పరిశీలించింది. చివరికి మ్యాచ్‌ రిఫరీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.. అని కమిటీ వెల్లడించింది. గతం స్లో ఓవర్‌రేట్‌ కారణంగా పంత్‌ జరిమానాను ఎదుర్కొన్నాడు.

➡️