రాష్ట్రంలో బిజెపితో అంటకాగుతున్న బిజెడి.. : రాహుల్‌ గాంధీ

భువనేశ్వర్‌   :  రాష్ట్రంలో బిజుజనతాదళ్‌ (బిజెడి) బిజెపితో అంటకాగుతోందని, ప్రజలను పట్టించుకోవడం లేదని   కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.  నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం నుండి 30 లక్షల మంది ప్రజలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వలస వెళ్లారని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్ర బుధవారం ఒడిశాలోని స్టీల్‌ సిటీ రూర్కెలాకు  చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు.

ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, ప్రధాని మోడీల భాగస్వామ్యంలో ప్రభుత్వం నడుస్తోందని, గత కొన్నేళ్లుగా వారిద్దరూ చేతులు కలిపి సమిష్టిగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు సక్రమంగా పనిచేయకపోవడంతో నిరుద్యోగం తీవ్రమైందని అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ వారిని వ్యతిరేకిస్తోందని అన్నారు. దీంతో రాష్ట్రం నుండి సుమారు 30 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వలసవెళ్లాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. 30 లక్షల మంది వలస వెళ్లగా, ఇతర రాష్ట్రాల నుండి 30 మంది కోటీశ్వరులు ఒడిశాలో సంపదను దోచుకునేందుకు వచ్చారని అన్నారు.  ఒడిశా జనాభాలో అత్యధిక శాతం మంది ఆదివాసీలేనని, వారితో పాటు దళితుల పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

విద్వేషం నిండిన రాష్ట్రంలో ప్రేమను అందించేందుకు తాను రాష్ట్రానికి వచ్చానని అన్నారు. తాను 6,8 గంటల పాటు ప్రజల మన్‌కీ బాత్‌ వినేందుకు ఇక్కడికి వచ్చానని, కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడతానని అన్నారు.

➡️