దెందులూరు.. సమస్యల హోరు

నియోజకవర్గంలో సాగు, తాగు, రహదారుల సమస్యలు
అస్తవ్యస్థంగా డ్రెయినేజీ వ్యవస్థ
                 దెందులూరు నియోజకవర్గం సమస్యలకు నిలయంగా మారింది. పాలకులు మారుతున్నా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలేదని ప్రజలు వాపోతున్నారు. అధ్వానంగా రోడ్లు, అస్తవ్యస్థంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రధానంగా వేసవిలో తాగు, నీరు అందక వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏలూరు మండలంలో విలీనమైన ఏడు గ్రామాల్లో మిగతా గ్రామాల్లో తాగునీరు సమస్య ప్రధానంగా ఉంది. పెదపాడు మండలంలో కృష్ణా కాలువలో తూడు, చెత్త పేరుకుపోయినా ఆధునికీకరణ చేపట్టడంలేదు. దెందులూరు సమస్యలకూ కేంద్రంగానే ఉంది. రోడ్ల సమస్యతో పాటు సాగునీటి సమస్య ఉంది. పెదవేగి మండలంలో జగన్నాధపురం ఎత్తిపోతల పథకం ముందుకు సాగడంలేదు. తమ్మిలేరుపై విజయరాయి వద్ద వంతెన నిర్మాణం ప్రణాళిక దశలోనే మిగిలిపోయింది.
ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌, దెందులూరు
ఏలూరు నియోజకవర్గం చుట్టుపక్కల విస్తరించి ఉన్న దెందులూరు నియోజకవర్గాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. నియోజకవర్గంలో పెదపాడు, ఏలూరు, దెందులూరు, పెదవేగి మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో సాగు, తాగునీటి సమస్యలు, అస్తవ్యస్థ మురుగునీటి పారుదల వ్యవస్థ, రాళ్లతో నిండిన రహదారులు వంటి అనేక సమస్యలు నెలకొన్నాయి.సమస్యల ఖర్ఖనా ఏలూరు మండలంఏలూరు మండలంలో అనేక సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. మండలంలో ఏడు వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ప్రతిఏటా ఖరీఫ్‌, రబీలో సాగునీటి సమస్య ఏర్పడుతుంది. గోదావరి ఆయకట్టుకు టేయిల్యాండ్‌ ప్రాంతం కావడంతో నీరు అందించినప్పటికీ శివారు పొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మండలంలోని ఏలూరు నగరంలో విలీనమైన ఏడు గ్రామాలు మినహా మిగిలిన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పైపులైన్‌ ద్వారా నీరు సరఫరా చేస్తామని ప్రకటిం చినప్పటికీ ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. దీంతో వేసవి వచ్చిందంటే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక పేదల ఇబ్బందులైతే వర్ణనాతీతం. మహేశ్వరపురం ముండికోడు రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో నింపలేని పరిస్థితి ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. విలీన గ్రామాలు నీటి కొరతతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. ఎన్‌టిఆర్‌, జగనన్న, ఇందిరమ్మ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలూరు నగరం నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు అధికంగానే ఉన్నాయి.అభివృద్ధిలో ”పేద”పాడుపెదపాడు మం డలం సమస్యలకు నిలయంగా మారింది. రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏలూరు నుంచి పెరికీడు వెళ్లే రహదారి గోతులమయంగా మారింది. టిడిపి ప్రభుత్వం హయాంలో రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ, తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్మాణానికి చర్యలు తీసుకోలేదు. మండలానికి వచ్చినటువంటి కృష్ణా కాలువ నిండా తూడు, చెత్త పేరుకుపోయాయి. చాలా ఏళ్లుగా ఆధునికీకరణ పనులు చేపట్టడం లేదు. కృష్ణా ఆయకట్టు పరిధిలో 22 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కృష్ణా కాలువ చెత్త, చెదరంతో నిండిపోయి ఉండటంతో నీరు అందని పరిస్థితి నెలకొంది. కృష్ణా కాలువను ఆధునికీకరించాలని రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెడచెవిన పెడుతున్నారు. మండలంలో డ్రెయినేజీ సమస్య కూడా ఉంది. చాలా గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. సమస్యలకూ దెందులూరు కేంద్రమేదెందులూరు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ సమస్యల్లో కూడా కేంద్రంలానే ఉంటుంది. ప్రధానంగా రోడ్ల సమస్య కొన్ని చోట్ల పట్టి పీడిస్తోంది. దెందులూరు, శ్రీరామవరం, పంగిడి, ఉండ్రాజవరం నుంచి హైవేకి వచ్చే, మలకచర్ల సూరప్పగూడెం రోడ్డు, మేదినరావుపాలెం, ముండూరు రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు. మెట్టలో సాగునీటి కొరత తీవ్రంగా ఉంది. బోర్ల నుంచి నీరు అందక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాలువల్లో తూడు తొలగింపు ప్రహాసనంగా మారుతుంది. ఏలూరు సీతంపేట కాలువల్లో తూడు, చెత్త పేరుకుపోయాయి. ప్రతి ఏటా నిధులు కేటాయిస్తున్నా అధికారులు తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో కాలువలో నీటి ప్రవాహానికి తూడు అడ్డుపడుతుండడంతో నీరు ముందుకు సాగటం లేదు. గోదావరి, సీతంపేట కాలువల పరిధిలో పది వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో నీరు అందక పంట పొలాలు ఎండిపోయి, భూమి నెర్రలిస్తుంది. ఈ ఏడాది మల్కాపురం, కొవ్వలి గ్రామాల ఆయకట్టు పరిధిలో వందలది ఎకరాలకు నీటి కొరత ఏర్పడింది. పెదవేగి..సమస్యల జరిదెందులూరు నియోజకవర్గంలో అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం పెదవేగి మండలం. నీటి కొరత తీవ్రంగానే ఉంది. ఎక్కువగా భూగర్భ నీటిపై ఆధారపడుతుంటారు. మండలం మధ్యలో నుంచి గోదావరి పట్టిసీమ కాలువ వెళ్తుంది. టిడిపి హయంలో రూ.వంద కోట్ల వ్యయంతో పోలవరం కాలువపై జగన్నాధపురం ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో పథకం నిర్మాణం చేపట్టలేదు. ఎత్తిపోతల పథకం పూర్తయి ఉంటే, సమీప గ్రామాల్లోని పొలాలకు సాగునీరు అందేది. అప్పట్లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతూ తమ్మిలేరుపై విజయరాయి వద్ద వంతెన నిర్మాణం చేపడతామని ప్రకటించారు. దీంతో నూజివీడును ఆనుకుని ఉన్న పెదవేగి మండలంలోని గ్రామాలకు వెళ్లేందుకు దగ్గర దారి ఏర్పడుతుంది. అయితే ఈ వంతెన నిర్మాణం ముందుకు వెళ్లడం లేదు. ప్రణాళిక దశలోనే ఉంది. మెట్ట ప్రాంతంలో పామాయిల్‌ భారీగా విస్తరించి ఉంది. అవసరాల దృష్ట్యా ఆయిల్‌పామ్‌కు మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ రైతుల్లో ఉంది. ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. మండలంలో రోడ్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఐదేళ్లుగా నిర్మాణం చేపట్టలేదు. ఎన్నికల ముందే పలు రోడ్లను అభివృద్ధి చేశారు. అయితే నాగన్నగూడెం, దిబ్బగూడం, కూచిపూడి, రత్నాలకుంట వెళ్లే రహదారి, దుగ్గిరాల నుంచి నూజివీడు వెళ్లే రహదారులపై రాళ్లు పైకి లేచి ప్రమాదకరంగా మారాయి. కొన్ని రోడ్లను సగం మాత్రమే నిర్మించి వదిలేశారు. దీంతో రోడ్డు లేని చోట ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

➡️