నవరత్నాలు ఫ్లస్

Apr 26,2024 14:54 #cm jagan
  • నేడు వైసీపీ మేనిఫెస్టో విడుద
  • అమరావతి : 2019 ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఈ ఎన్నికల్లో నవరత్నాలు ఫ్లస్‌ పేరుతో మేనిఫెస్టోను సిద్ధంచేశారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకు తుదిమెరుగులు దిద్ది మళ్లీ వాటిని కొనసాగిస్తూ మరో మూడు కొత్త పథకాలకు రూపకల్పన చేసినట్లుగా సమాచారం. రైతులు, మహిళలు, డ్వాక్రా మహిళలు, విద్య, వైద్యం తదితర రంగాలపై కేంద్రీకరణ చేసినట్లుగా సమాచారం. తొలుత అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జరిగిన ‘సిద్ధం’ బహిరంగసభలో మేనిఫెస్టో విడుదల చేయాలని జగన్మోహన్‌ రెడ్డి మొదట్లో అనుకున్నారు. గడిచిన ఆరుమాసాలుగా మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్న కమిటీ తన బాధ్యతలను పూర్తిచేసింది. దాదాపు 15 రోజుల క్రితం మేనిఫెస్టో కమిటీ జగన్‌తో భేటీ అయి వివిధ అంశాలను వివరించిందని పార్టీవర్గాల సమాచారం. జగన్‌ సూచనల ప్రకారం కమిటీ మేనిఫెస్టోను రెడీ చేసిందట. సిద్ధమైన మేనిఫెస్టోను జగన్‌ రాప్తాడు బహిరంగసభలో విడుదల చేస్తారని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం కూడా సాగింది. మధ్యతరగతి, పేద మహిళలకు ప్రాధాన్యతతో పాటుగా బీసీలకు వరాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం. రైతు రుణమాఫీపైన కూడా హామీ ఉండొచ్చని తెలుస్తోంది. 2019లో ప్రకటించిన నవరత్నాల పథకాలకు మించి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఉండబోతున్నట్లు పార్టీలో టాక్‌ వినబడుతోంది. జగన్‌ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఇంతకుముందే చంద్రబాబునాయుడు రిలీజ్‌ చేసిన సూపర్‌ సిక్స్‌ మినీ మేనిఫెస్టోతో పోల్చి చూడటం మొదలవుతుంది. ఈసారి ఉద్యోగాల భర్తీపైన, యువత అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారనే చర్చలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు వైసిపి మేనిఫెస్టోను సిఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించనున్నారు. శుక్రవారంనాడు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మరోమారు సిఎం వైఎస్‌ జగన్‌తో భేటీ కానుంది. రేపటి నుంచి సిఎం ఎన్నికల ప్రచారంమరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈనెల 28 నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గంటారు. ఈనెల 28న (ఆదివారం) ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గంటారు. ఈనెల 28వతేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒకరోజు ముందు శనివారం వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో సీఎం వైఎస్‌ జగన్‌ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన విషయం తెఇసిందే. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీ. మేర సాగిన బస్సు యాత్ర కొనసాగింది. బస్సు యాత్రలో భాగంగా 16 బహిరంగ సభలు జరిగాయి. .
➡️