ప్రశాంత ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

May 8,2024 21:44

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల సమన్వయ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో బుధవారం జరిగింది. మే 13న జరిగే పోలింగ్‌కు సామగ్రి పంపిణీ, రవాణా, రూట్లు తదితర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి లోపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పోలింగ్‌ పూర్తి చేసుకొని తిరిగి వచ్చి సామగ్రి అప్పగించే సమయంలో నిర్దేశిత ఫారాలు, సామగ్రిని ఖచ్చితంగా తనిఖీ చేసి తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్‌ రూంల్లో ఇవిఎంను భద్రపర్చడంలో జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు. బందోబస్తు, సిబ్బందిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవడం వంటి అంశాల్లో స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ఆయన చెప్పారు. ప్రశాంత ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రిసెప్షను, కౌంటింగ్‌ సెంటర్‌ ఏర్పాట్లు పరిశీలనఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాట్లను కలెక్టరు, జిల్లా ఎన్నికల అదికారి నిశాంత్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల రిసీవింగు రిసెప్షను సెంటర్ల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూంలను, ఓట్ల లెక్కింపు గదులను, కంట్రోల్‌ రూం, మీడియా సెంటర్‌ ఏర్పాటు చేయాల్సిన వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఉద్యాన కళాశాల సమావేశమందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ శాఖలకు కేటాయించిన పనుల పురోగతిని సమీక్షించారు. రెవెన్యూ, పోలీసు, రోడ్లు భవనాలు, విద్యుత్‌ శాఖ, పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖల అధికారులకు వారికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింటు కలెక్టర్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ ఎస్‌ శోబిక, సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకొండ ఆర్‌ఒ శుభం బన్సల్‌, డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, ఎస్డిసి ఆర్‌వి సూర్యనారాయణ, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్‌అండ్‌బి ఇంజినీరింగ్‌ అధికారి ఎస్‌.వేణుగోపాల రావు, డిఆర్‌డిఎ పిడి సత్యంనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️