శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి : ఇజ్రాయిల్‌కు అమెరికా, ఈజిప్ట్‌ పిలుపు

Mar 23,2024 11:13 #America, #calls, #concluded, #Egypt, #Israel, #Peace
  • గాజాలో కాల్పుల విరమణ జరగాలి

కైరో : ఇజ్రాయిల్‌, హమాస్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని, గాజాలో కాల్పుల విరమణ జరగాలని ఈజిప్ట్‌, అమెరికా కోరాయి. ప్రస్తుతం ఈజిప్ట్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈజిప్ట్‌, సౌదీ అరేబియా, జోర్డాన్‌, కతార్‌ల విదేశాంగ మంత్రులతో బహుళపక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, యుఎఇ అంతర్జాతీయ సహకార మంత్రి కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశాలనంతరం బ్లింకెన్‌ ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రి సామేV్‌ా శౌక్రితో కలిసి పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఇజ్రాయిల్‌ బందీలను, పాలస్తీనా ఖైదీలను విడుదల చేసి, గాజాలో తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాల్సిన ఆవశ్యకత వుందని అన్నారు. అలాగే గాజాలో మానవతా సాయాన్ని కూడా విస్తరించాల్సి వుందన్నారు. ఇప్పటికే గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, ఇటువంటి స్థితిలో రాఫాలో మిలటరీ ఆపరేషన్‌ ఆలోచననలు విడిచిపెట్టాలని వారు కోరారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు నెలకొనేందుకు ప్రస్తుత సంక్షోభాన్ని సమూలంగా పరిష్కరించుకోవాల్సి వుందన్నారు. ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ క్లిష్టమైనదే అయినా అవకాశాలున్నాయని బ్లింకెన్‌ పేర్కొన్నారు.

రోజూ 37 మంది తల్లులు చనిపోతున్నారు
గాజాలో దాడులతో ప్రతిరోజూ సగటున 37 మంది తల్లులు మరణిస్తున్నారని పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ తెలిపింది. మార్చి 21న అరబ్‌ ప్రపంచం మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ గాజాలో యుద్ధంతో ప్రతి రోజూ తల్లులు, పిల్లలు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారని, మహిళా ఖైదీలపై దాడులు, నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వారి భర్తలు, కొడుకుల సమాచారం కోసం మహిళలను బందీలుగా చేసి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెలిపింది. పాలస్తీనా మహిళలపై జరుగుతున్న ఈ నేరాలకు అంతర్జాతీయ మహిళా సంఘాలు, సంస్థలే బాధ్యత వహించాలని ఆ ప్రకటన పేర్కొంది.

➡️