నవాజ్‌ షరీఫ్‌ అప్పీల్‌పై విచారణ చేపట్టనున్న ఐహెచ్‌సి

ఇస్లామాబాద్‌ :     అల్‌ -అజీజియా ఉక్కు కర్మాగారం అవినీతి కేసులో తనకు విధించిన శిక్షపై పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అప్పీల్‌పై గురువారం ఇస్లామాబాద్‌ హైకోర్టు (ఐహెచ్‌సి) విచారణ చేపట్టనుంది. ఈ కేసులో 2018 డిసెంబర్‌లో అవినీతి నిరోధక కోర్టు నవాజ్‌ షరీఫ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో వైద్య చికిత్స కోసం 2019 అక్టోబర్‌లో ఆయన అనుమతి పొందారు. చికిత్స పేరుతో లండన్‌ వెళ్లిన నవాజ్‌ షరీఫ్‌ అనంతరం పలుమార్లు సమన్లు పంపినా పాకిస్థాన్‌కు తిరిగి రాలేదు. దీంతో నవాజ్‌ షరీఫ్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు మరియు అకౌంటిబిలిటీ కోర్టు ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించింది.

షరీఫ్‌ తన పాలన సమయంలో దోచుకున్న అవినీతి సొమ్ముతో సౌదీ అరేబియాలో మిల్లును స్థాపించారని నేషనల్‌ అకౌంటిబిలిటీ బ్యూరో (ఎన్‌ఎబి) పేర్కొంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌదీ ప్రభుత్వం నిధులు అందిస్తుందని తెలిపింది.

పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ మాత్రమే పాకిస్థాన్‌కు రికార్డు స్థాయిలో మూడు సార్లు ప్రధానిగా అయిన ఏకైక వ్యక్తి. 2024 ఫిబ్రవరిలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో పిఎంఎల్‌-ఎన్‌కి నేతృత్వం వహించేందుకు మూడేళ్ల అనంతరం గత నెల పాకిస్థాన్‌కు తిరిగి వచ్చారు. నవాజ్‌పై మొత్తం మూడు కేసులు నమోదు కాగా, రెండు కేసుల్లో దోషిగా నిర్థారణ కాగా, ఒక కేసులో నిర్దోషిగా బయటపడ్డారు.

➡️