నైనిటాల్‌ అడవుల్లో దావానలం !

Apr 28,2024 09:33 #fire, #Nainital forests!

60గంటలుగా చెలరేగుతున్న మంటలు
108 హెక్టార్లలో తగలబడిన అటవీభూములు
రంగంలోకి దిగిన సైన్యం
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ అడవుల్లో దావానలం చెలరేగింది. గత 60గంటలుగా సాగుతున్న ఈ కార్చిచ్చుతో ఇప్పటివరకు రాష్ట్రంలో పలుచోట్ల 108 హెక్టార్ల మేర అటవీ భూములు తగలబడ్డాయి. నైనిటాల్‌ జిల్లా ప్రధాన కేంద్రానికి సమీపంలో మంటలు చెలరేగడంతో ఆ పక్కనే గల హైకోర్టు కాలనీ ప్రాంత ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సైన్యాన్ని, అటవీశాఖ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఆర్మీకి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్లు భీమ్‌టాల్‌ సరస్సు నుండి నీటిని తీసుకొచ్చి అటవీ ప్రాంతాలపై జల్లి మంటల ఉధృతిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చాలావరకు మంటలను అదుపు చేయగలిగినట్లు అధికారులు తెలిపారు. గత 24గంటల్లో రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు 23 చోటుచేసుకున్నాయన్నారు.
నందా రేంజ్‌లో ఈ వారం ప్రారంభంలో మొదటగా మంటలు చెలరేగాయని, ఆ తర్వాత దిగువ ప్రాంతాలకు వ్యాపించి ఐఎఎఫ్‌ స్థావరం వరకు చేరుకున్నాయని నైనిటాల్‌ జిల్లా అటవీ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. నగరానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఈ మంటలు చెలరేగాయని చెప్పారు. కార్చిచ్చు కారణంగా నల్లని దగ్టమైన పొగతో నైనిటాల్‌, సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం కావడంతో ఇక్కడకు వచ్చిన పర్యాటకులు కూడా తాజా పరిస్థితులతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
ముఖ్యమంత్రి పుష్కర్‌ దామి అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితులను సమీక్షించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఏరియల్‌ సర్వే జరిపారు. ఈ మంటలు ఎలా ప్రారంభమయ్యాయో, ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా పాల్పడ్డారా అనేది దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అడవుల్లో చెలరేగే ఈ మంటలను అదుపు చేయడం పెద్ద సవాలుగా వుంటుందని వ్యాఖ్యానించారు. రుద్రప్రయాగ్‌లో శుక్రవారం ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

➡️