పాకిస్తాన్‌లో భారీ వర్షాలు – ఇప్పటికి 87మంది మృతి

Apr 20,2024 09:57 #87, #heavy rains, #Pakistan, #people died

పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌లో భారీ వర్షాలకు ఇప్పటికి 87మంది మృతి చెందారు. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు వరదలొచ్చాయి. పలుచోట్ల ఇండ్లు కూలాయి. పిడుగులుపడ్డాయి. ఈ ఘటనల్లో 87 మంది మృతి చెందగా, 82 మంది గాయపడ్డారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డిఎంఎ) ఈ వివరాలను మీడియాకు అందించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది.

ప్రావిన్స్‌లో అత్యధిక ప్రాణ నష్టం…
వార్తా సంస్థ జిన్హువా నివేదిక ప్రకారం …. వర్షాల కారణంగా పాకిస్తాన్‌ దేశవ్యాప్తంగా 2,715 ఇళ్లు పాక్షికంగాను, పూర్తిగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌లోని వాయువ్య ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో వరదల కారణంగా … అత్యధిక ప్రాణనష్టం సంభవించినట్లు ఎన్‌డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా 36 మంది ప్రాణాలు కోల్పోగా, 53 మంది గాయపడ్డారు. తూర్పు పంజాబ్‌ ప్రావిన్స్‌లో 25 మరణాలు నమోదయ్యాయి. ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం.

ఆకస్మిక వరదలొచ్చే అవకాశం : వాతావరణశాఖ హెచ్చరిక
నైరుతి బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో మొత్తం 15 మంది మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా 11 మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారని ఎన్‌ఎండీఏ తెలిపింది. వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై పాకిస్తాన్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ తన అంచనా నివేదికలో ఏప్రిల్‌ 22 వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిక జారీ చేసింది.

➡️