ఐర్లాండ్‌, బ్రిటన్‌ల్లో ఇషా తుపాను బీభత్సం

Jan 23,2024 10:33 #londan, #Tufan
  • అంథకారంలో లక్షలాదిమంది 
  • వందలాది రైళ్లు రద్దు

లండన్‌ : బ్రిటన్‌, ఐర్లాండ్‌లను శీతాకాలపు తుపానులు ముంచెత్తుతున్నాయి. తాజాగా సోమవారం సంభవించిన ఇషా తుపాను రెండు దేశాల్లో బీభత్సాన్ని సృష్టించింది. తుపాను ధాటికి వందలాది రైళ్లు రద్దయ్యాయి. అనేక విమానాలను రద్దు చేయడమో, దారి మళ్లించడమో చేశారు. వేలాదిమంది ప్రజలు విద్యుత్‌ లేక అంథకారంలో చిక్కుకున్నారు. ఐర్లాండ్‌లో దాదాపు 2,30,000 ఇళ్ళకు, వాణిజ్య సంస్థలకు విద్యుత్‌ లేకుండా పోయింది. పొరుగునున్న మరో దీవిలో 40వేల మంది చీకటిలో చిక్కుకున్నారు. గంటకు దాదాపు 160కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కుండపోతగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇషా తుపానుకు ముందుగానే అసాధారణమైన గాలులు వీస్తాయని బ్రిటన్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రాత్రి పరిస్థితి భయంకరంగా తయారైందని, ఈశాన్య ఇంగ్లండ్‌లో బ్రిజ్‌లీ వుడ్‌ రాడార్‌ స్టేషన్‌ వద్ద గాలుల తీవ్రత గంటకు 160కిలోమీటర్లుగా నమోదైందని అధికారులు చెప్పారు. సెప్టెంబరు నుండి వరుసగా ఐర్లాండ్‌, బ్రిటన్‌ల్లో తుపానులు విరుచుకుపడుతున్నాయి. ఈ తుపానుల ధాటికి మహా వృక్షాలు సైతం నేలకూలుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో ప్రజలు అంథకారంలో మగ్గాల్సి వస్తోంది. చెట్లు కూలడం, వరదల తాకిడికి స్కాట్లాండ్‌, ఉత్తర ఇంగ్లండ్‌ల్లో ప్రధాన రహదారులన్నీ దెబ్బతిన్నాయి. దాంతో రాకపోకలు స్తంభించాయి.

➡️