కరువునూ ఆయుధంగా మార్చుకుంటున్న ఇజ్రాయిల్‌ : ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్‌ హెచ్చరిక

గాజా : గాజాలో తలెత్తుతున్న కరువు కాటకాలన్నీ కృత్రిమమైనవేనని, దీన్నొక ఆయుధంగా మార్చుకోవాలని ఇజ్రాయిల్‌ ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్‌ హెచ్చరించారు. ఇజ్రాయిల్‌ ఉద్దేశ్యం రుజువైతే ఇది యుద్ధ నేరం కిందకు వస్తుందని హై కమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ అన్నారు. గాజాలో అవసరమైన వారికి ఆహార, సహాయ సరఫరాలు అందకుండా చేసే ప్రయత్నాలతో సహా ఈ యుద్ధంలో ఇరు వర్గాలు తమ చర్యలకు బాధ్యతల నుండి తప్పించుకోలేవని అన్నారు. మానవతా సాయం అందచేయడానికి అనేక అవాంతరాలు, అవరోధాలు, ఆంక్షలు వుంటున్నాయని, వాటన్నింటికీ ఇజ్రాయిల్‌నే నిందించాల్సి వుందని తన సహచరులు చెబుతున్నారని అన్నారు. కాగా టర్క్‌ చేసిన వ్యాఖ్యలను, విమర్శలను ఇజ్రాయిల్‌ ఆర్థిక మంత్రి నీర్‌ బర్కత్‌ తీవ్రంగా విమర్శించారు. ఇవన్నీ పూర్తిగా అర్ధరహితమైనవని అన్నారు. పూర్తి బాధ్యతారాహిత్యమైనవని అన్నారు. గాజాలోని పాలస్తీనియన్లకు సాయం అందడం లేదంటే దాన్ని పంపిణీ చేయంలో విఫలమైన క్యరాజ్య సమితిని అనాలి కానీ ఇజ్రాయిల్‌ను కాదని అన్నారు. కానీ పాలస్తీనాకు మానవతా సాయాన్ని అందించడంలో కీలక మైన పాత్ర పోషించే ఐక్యరాజ్య సమితి శరణార్ధుల సహాయ సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) టర్క్‌ వ్యాఖ్యలకు మద్దతిచ్చింది. గాజాలోఓ క్షామ పరిస్థితులు నెలకొనే దిశగా సమయం పరిగెడుతోందని అన్నారు. ఆహార బృందాలను అడ్డగిస్తుండడంతో ఉత్తర గాజాలో దుర్భిక్షం పొంచి వుందన్నారు. పైగా హమాస్‌ జరిపిన దాడిలో ఐక్యరాజ్య సమితి సిబ్బంది చాలా మంది పాల్గొన్నారంటూ ఇజ్రాయిల్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సంస్థకు వచ్చే నిధులను అనేక దేశాలు నిలిపివేశాయని పేర్కొంది.

➡️