షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయిల్‌ కాల్పులు

  •  80 మంది అదుపులోకి

గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ అమానుష దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున గాజాస్ట్రిప్‌లోని అతిపెద్ద ఆస్పత్రి షిఫాపై ఇజ్రాయిల్‌ దళాలు దాడికి దిగాయి. హమాస్‌ మిలిటెంట్లు అక్కడ ఉన్నారని, కాంపౌండ్‌ లోపల నుండి కాల్పులు చేపట్టారని ఆరోపించాయి. ఇవే ఆరోపణలతో గతేడాది నవంబర్‌లోనూ షిఫా ఆస్పత్రిపై దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆస్పత్రిలో సుమారు పదివేల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. ఇజ్రాయిల్‌ దళాలు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నాయని, పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ దళాలు ట్యాంకులు, ఫిరంగులతో మెడికల్‌ కాంప్లెక్స్‌ను చుట్టుముట్టాయని, లోపల ఉన్న వారిపై కాల్పులు జరిపాయని ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తులు తెలిపారు. భవనాలపై దాడి చేయడంతో పాటు డజన్ల కొద్దీ పౌరులను అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు.
తాము లోపల చిక్కుకుపోయామని మూడు నెలలుగా ఈ ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతున్న అబ్దుల్‌ హదీ సయ్యద్‌ తెలిపారు. కదిలితే ఇజ్రాయిల్‌ దళాలు కాల్పులు జరుపుతున్నాయని, దీంతో వైద్యులు ఎక్కడికక్కడ నిలిచిపోయారని, అంబులెన్స్‌ సేవలు ఆగిపోయాయని చెప్పారు.
ఆస్పత్రిలోని కొన్ని భవనాలపై సైన్యం ”నిర్దిష్టమైన ఆపరేషన్‌” ప్రారంభించిందని, ఇక్కడ కొందరు హమాస్‌ మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయిల్‌ చీఫ్‌ మిలటరీ ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. తమ బలగాలు సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నాయని అన్నారు.
ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహించే
భవనంపై కాల్పులు : గాజా ఆరోగ్య శాఖ
ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహించే భవనంపై ఇజ్రాయిల్‌ సైన్యం కాల్పులు జరుపుతోందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆస్పత్రి గేటు వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని పేర్కొంది. రోగులు, వైద్య సిబ్బంది, నిరాశ్రయులు సహా సుమారు 30,000 మంది ఈ ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులతో సుమారు 31,645 మంది పాలస్తీనియన్లు మరణించగా, 73,676 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్‌ అదుపులో సుమారు 10,000 మంది పాలస్తీనియన్లు ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థలు అంచనా వేస్తున్నాయి.

➡️