నెతన్యాహు యుద్ధోన్మాదంపై ఇంటా, బయటా నిరసనలు

May 8,2024 10:21 #Netanyahu's, #warmongering

హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలి
ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి వర్సిటీలకు విస్తరించిన నిరసనలు
టెల్‌ అవీవ్‌: గాజాలోని రఫా నగరంలో చిక్కుకున్న నిస్సహాయులైన శరణార్థులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోయడాన్ని ఆపాలని జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న విజ్ఞప్తులను మితవాద నెతన్యాహు ప్రభుత్వం బేఖాతరు చేస్తూ భూతల దాడుల ప్రణాళికతో మొండిగా ముందుకెళ్తోంది. రఫాలో లక్షమందిని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్‌ హుకుం జారీ చేయడంతో ఈజిప్టు సరిహద్దును ఆనుకుని వున్న ఈ నగరం నుంచి శరణార్థులు వలసపోతున్నారు. ఖతార్‌, ఈజిప్టు మధ్యవర్తిత్వంలో కైరోలో జరిగిన చర్చల్లో ఓ కొలిక్కి వచ్చిన కాల్పుల విరమణ , బందీల విడుదల ఒప్పందాలను మితవాద నెతన్యాహు ప్రభుత్వం బుల్డోజ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవీవ్‌, హైపా, జెరూసలెం, బీర్షెవా తదితర పట్టణాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. బందీలను విడిపించుకోడానికి బదులు, హమాస్‌ చివరి రక్షణ దుర్గంగా ఉన్న రఫాను ఆక్రమించుకోవడానికి, పెద్దయెత్తున మారణకాండ సాగించడానికి మెగ్గుచూపుతున్న నెతన్యాహుపై ఇజ్రాయిలీయుల్లో మరీ ముఖ్యంగా 211 రోజులుగా తమవారి విడుదల కోసం ఎదురుచూస్తున్న బందీల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరహంతకుడు, యుద్ధోన్మాది నెతన్యాహు వెంటనే తప్పుకుని, ముందస్తు పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని ప్రదర్శకులు డిమాండ్‌ చేశారు. దురాక్రమణను అడ్డుకుందాం అన్న బ్యానర్‌పై టెల్‌ అవీవ్‌లో ఆదివారం టెల్‌ అవీవ్‌లోని ఆర్ట్‌ మ్యూజియం పక్కన హోస్టేజి ఫ్యామిలీ స్క్వేర్‌ వద్ద జరిగిన భారీ ర్యాలీలో ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ, హడాష్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గాజాపై దురాక్రమణను తక్షణమే ఆపాలని వారు నినదించారు. బందీల కుటుంబ సభ్యులు ఇజ్రాయిల్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయం దగ్గర నుంచి కవాతు నిర్వహించారు. బిగిన్‌ రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బందీగా ఉన్న మటన్‌ జాన్‌ గౌకర్‌ తల్లి ఐనన్‌ మాట్లాడుతూ, ” మా కుటుంబం 200 రోజులకు పైగా నరకయాతన అనుభవిస్తున్నాం. బందీలను విడుదలజేసే ఒప్పందం ఇప్పుడు టేబుల్‌ మీద సిద్ధంగా ఉంది. హమాస్‌ దానికి అంగీకరిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. నెతన్యాహు మాత్రం ఈ ఒప్పందాన్ని బుల్డోజ్‌ జేయడానికి మరో ఎత్తుగడ పన్నాడు.” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధాన్ని ఆపండి, బందీలను విడింపించండి, హమాస్‌తో తక్షణం ఒప్పందం పై సంతకం చేయండి’ అంటూ ప్రదర్శనకారులు నినదించారు.
ఆదివారం నాడు నెతన్యాహు ఇజ్రాయిల్‌ నేషనల్‌ టీవీ చానెల్‌ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడుతూ, బందీలుగా మిగిలి వున్న 150 మందిని హమాస్‌ విడుదలజేసిన తరువాత కూడా యుద్ధం కొనసాగుతుందని చెప్పాడు. మునుపటి కాల్పుల విరమణ సమయంలో సుమారు 100 మంది బందీలను హమాస్‌ విడిచిపెట్టింది.
నెతన్యాహు రఫాపై దాడిని ఆపగల శక్తి అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి పశ్చిమ దేశాలకు ఉన్నప్పటికీ అవి ఆ పని చేయడం లేదు. బైడెన్‌, సునాక్‌, మోడీలు గాజాలో మారణహోమానికి మద్దతునిస్తూనే ఉన్నారు. వారి చేతులకు గాజా ప్రజల రక్తపు మరకలు అంటుకున్నాయి. బైడెన్‌ తాజాగా ఇజ్రాయిల్‌కు 1500 కోట్ల డాలర్లు సైనిక సాయం అందించారు. గాజాలో ఇజ్రాయిల్‌ మారణ హోమానికి మోడీ కొన్నిసార్లు నేరుగా, కొన్నిసార్లు మౌనంగా మద్దతు ఇస్తున్నారు. అదానీ కంపెనీ తయారు చేసిన డ్రోన్లను ఇజ్రాయిల్‌ గాజాలో మారణ హోమానికి ఉపయోగిస్తున్నది. కాబట్టి మోడీ ప్రభుత్వానికి కూడా ఈ నేరంలో పాత్ర ఉంది.
మరోవైపు గాజాకు సంఘీభావంగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి యూనివర్సిటీ క్యాంపస్‌లలో నిరసన శిబిరాలు వెలిశాయి. ఇంకాయ ఎంతమంది పిల్లలు, అమాయకులైన పౌరులను బాంబులేసి, కాల్చి చంపుతారు. ఇంకా ఎంతమంది ఆకలితో చనిపోవాలి అని బ్రిటిష్‌ ఎంపి క్రిస్‌ స్టీఫెన్స్‌ ప్రశ్నించారు.

➡️