అడ్డంకులను అధిగమించి అభివృద్ధి సాధిస్తాం – రష్యా అధ్యక్షులు పుతిన్‌

May 7,2024 00:30 #ennika, #Russian President Putin

– ఐదోసారి దేశాధ్యక్షునిగా ప్రమాణం
మాస్కో : అన్ని అవరోధాలను అధిగమించి, అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తామని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. మంగళవారం రష్యా అధ్యక్షునిగా ఆయన ఐదవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి 15 నుండి 17 వరకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 87.28 శాతం ఓట్లు లభించిన సంగతి తెలిసిందే. క్రెమ్లిన్‌లో ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఃరాబోయే దశాబ్దాల కాలంలో దేశాభివృద్ధిలో నమ్మదగిన కొనసాగింపు వుంటుందని హామీ ఇస్తున్నాం. రష్యా శక్తి సామర్ధ్యాలను మరింత బలోపేతం చేసేలా యువతరాలను పెంచాలి, విద్యావంతులను చేయాలి. పరస్పర సామరస్యంతో జీవించగలిగే, రష్యాలో నివసించే ప్రజలందరి సాంప్రదాయాలను పరిరక్షించేలా మన దేశ హోదాను అభివృద్ధి పరుస్తామని హామీ ఇస్తున్నాంః అని పుతిన్‌ అన్నారు. ఈ మేరకు క్రెమ్లిన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.
1999లో మొదట ప్రధానిగా చేసిన పుతిన్‌ ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షులయ్యారు. 2000 మార్చి 26న దేశాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి అధ్యక్షునిగా పనిచేశారు. 2008 నుండి 2012 వరకు ప్రధానిగా చేశారు. తిరిగి 2012 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2018లో ఆరేళ్ళ పదవీ కాలానికి తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

➡️