40 శాతం ఎంపీలు నేరచరితులే

29 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు
9 మందిపై హత్య, 28 మందిపై హత్యాయత్నం కేసులు
17వ లోక్‌సభ సభ్యులపై ఎడిఆర్‌తాజా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలలో 40 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు నడుస్తున్నాయి. పార్లమెంట్‌ సభ్యులు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఎడిఆర్‌) సంస్థ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం 29 శాతం ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన క్రిమినల్‌ కేసులు కోర్టులో నిరూపితమైతే గరిష్టంగా ఐదు సంవత్సరాల కారాగార శిక్ష పడుతుంది. ఇది నాన్‌-బెయిలబుల్‌ నేరం. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం, దాడి, హత్య, కిడ్నాప్‌, లైంగిక వేధింపులు వంటి నేరాలు వీటి కిందికి వస్తాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8లో పొందుపరచిన నేరాలు కూడా క్రిమినల్‌ కేసులే.
రాష్ట్రాల వారీగా ఎంపీలపై ఉన్న క్రిమినల్‌ కేసులను ఎడిఆర్‌విశ్లేషించింది. మొత్తం 514 మంది ఎంపీల నేరచరితను పరిశీలించగా వారిలో 225 మందిపై (44 శాతం) క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తేలింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, బీహార్‌లో 31 మంది, పశ్చిమ బెంగాల్‌లో 23 మంది, మహారాష్ట్రలో 25 మంది, తెలంగాణలో ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది, తమిళనాడులో 19 మంది, కేరళలో 17 మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీల విషయానికి వస్తే హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో 33 మంది, బీహార్‌లో 22 మంది, పశ్చిమ బెంగాల్‌లో 16 మంది, మహారాష్ట్రలో 13 మంది, తెలంగాణలో ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌లో 8 మంది, తమిళనాడులో 11 మంది, కేరళలో 8 మంది ఉన్నారు.
పార్టీల వారీగా…
పార్టీల వారీగా చూస్తే బిజెపికి చెందిన 118 మంది, కాంగ్రెస్‌కు చెందిన 26 మంది, డిఎంకెకు చెందిన 11 మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది, జెడియుకు చెందిన 12 మంది, వైఎస్సార్‌సిపికి చెందిన 8 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్‌ కేసులకు సంబంధించి బిజెపికి చెందిన 87 మంది, కాంగ్రెస్‌కు చెందిన 14 మంది, డిఎంకెకు చెందిన ఏడుగురు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు, జెడియుకు చెందిన ఎనిమిది మంది, వైఎస్సార్‌సిపికి చెందిన ఏడుగురిపై కేసులు నడుస్తున్నాయి.
ఎంపీలకు వెసులుబాట్లు
ఎన్ని తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ పార్లమెంట్‌ సభ్యులకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండగా వారిని అరెస్ట్‌ చేయకూడదు. అయితే ఈ వెసులుబాటు కేవలం సివిల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారికే. క్రిమినల్‌ కేసులకు ఇది వర్తించదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 105 ప్రకారం ఎంపీలు తమ పార్లమెంటరీ విధులను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వర్తించవచ్చు. సివిల్‌ కేసులు ఉన్న ఎంపీలను సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, సమావేశలు ముగిసిన తర్వాత 40 రోజుల వరకూ అరెస్ట్‌ చేయకూడదు. హౌస్‌ కమిటీ సమావేశం విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది.
హత్య, హత్యాయత్నం కేసులు
తొమ్మిది మంది ఎంపీలపై హత్య కేసులు ఉన్నాయి. వీరిలో ఐదుగురు బిజెపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి, వైసిపి పార్టీలకు చెందిన ఒక్కొక్కరు, ఓ స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. 28 మంది ఎంపీలపై హత్యాయత్నం కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో కూడా అత్యధికంగా బిజెపికి చెందిన 21 మంది ఉన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఎన్‌సిపి (శరద్‌ పవార్‌), రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ, విదుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీలకు చెందిన ఒక్కో సభ్యుడిపై హత్యాయత్నం కేసులు నడుస్తున్నాయి. ఇక మహిళలపై నేరాలకు సంబంధించి తమపై కేసులు ఉన్నాయని 16 మంది ఎంపీలు ప్రకటించారు. వీరిలో ముగ్గురిపై అత్యాచారం (ఐపిసి సెక్షన్‌ 376) కేసులు పెట్టారు.

➡️