వ్యవసాయ పరిశోధనలో క్షీణిస్తున్న వ్యయం : సర్వే

May 8,2024 10:02 #A Survey, #agricultural

న్యూఢిల్లీ : 2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి సుమారు రూ.13.85 పైసలు రాబడి వస్తుందని సర్వేలో వెల్లడైంది. పైగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఇతర కార్యకలాపాల నుండి వచ్చే రాబడిని ఇది అధిగమించడం గమనార్హం. రాబడి అధికంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం వ్యసాయ పరిశోధనల్లో వ్యయాన్ని పెంచడం లేదని సర్వే స్పష్టం చేసింది.
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసిఎఆర్‌) కింద పనిచేస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ రీసెర్చ్‌ (ఎన్‌ఐఎపి) గత నెలలో ఈ వర్కింగ్‌ పేపర్‌ను ప్రచురించింది. ఆహారంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా తక్కువ వ్యవసాయ విస్తరణ మధ్య వాటి ఉత్పత్తికి భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత పెట్టుబడులు అత్యవసరం. ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాలను పెంచడానికి వ్యవసాయంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి) విభాగాలు, వాటి అనుబంధ విభాగాలు ప్రాధాన్యత ప్రధానమైనది. వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలను పెంచిన తర్వాత పెట్టుబడి పెట్టిన ప్రతిరూపాయికి రూ.7.40 రెండవ అత్యుత్తమ రాబడిని ఇస్తుందని పరిశోధనల్లో తేలింది.
సర్వేలో వెల్లడైన కీలక అంశాలు
శ్రీ విస్తృతమైన వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల్లో, సబ్‌సెక్టార్‌ స్థాయిలో చెల్లింపుల్లో స్పష్టమైన తేడాలున్నట్లు సర్వే గుర్తించింది. జంతు శాస్త్ర పరిశోధనల్లో వ్యయంపై ఆదాయం ప్రతి రూపాయికి రూ.20.81 గణనీయంగా అధికంగా ఉంది. అదే క్రాప్‌ సైన్స్‌ సెక్టార్‌పై రూ.11.69గా ఉంది.
శ్రీ వ్యవసాయ పరిశోధలపై పెట్టుబడుల్లో ప్రాంతాల వారీగా కూడా గణనీయమైన తేడా ఉంది. 2011-2020 మధ్య ఒడిశా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లలో దేశంలోని నికర విత్తన విస్తీర్ణంలో 43 శాతంగా ఉంది. వాటిలో వ్యవసాయ పరిశోధనపై జిడిపిలో 0.25 శాతం కంటే తక్కువ ఖర్చు చేసింది. మరోవైపు జమ్ముకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌, కేరళ మరియు అస్సాంలలో వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి జడిపిలో కేవలం 0.80 శాతం మాత్రమే ఖర్చు చేసింది. పశువులు, సహజవన రులపై గణనీయంగా తక్కువ వ్యయం చేస్తున్నట్లు స్పష్టమైంది. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్యయం మరింత సమతుల్యంగా ఉందని సర్వే తెలిపింది. 2011-2020 మధ్య కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వరుసగా 33.8 శాతం సహకారం అందించాయి. వ్యవసాయ ఆర్‌అండ్‌ డిలో మొత్తం పెట్టుబడిలో ప్రభుత్వాల వాటా 58.5 శాతంగా ఉంది. అయితే ప్రైవేట్‌ రంగం పెట్టుబడులు 8 శాతానికి పెరిగినప్పటికీ… ప్రపంచ సగటు కన్నా తక్కువగానే ఉంది.
2011-2020 వరకు, భారత్‌ తన వ్యవసాయ జిడిపిలో 0.61 శాతం పరిశోధన కోసం ఖర్చు చేసింది. ప్రపంచ సగటు 0.93 శాతంలో మూడింట రెండు వంతులుగా ఉన్నట్లు సర్వే తేల్చింది. వ్యవసాయ జిడిపిలో విస్తరణ సేవలపై ఖర్చు చేసింది 0.16 శాతం. 2020-21మధ్య భారత్‌ వ్యవసాయ జిడిపిలో పరిశోధన కోసం 0.54 శాతం ఖర్చు చేయగా, విస్తరణ సేవల కోసం 0.11 శాతం ఖర్చు చేసింది.
పరిశోధన వ్యయంలో వార్షిక వృద్ధి 1981-1990లో 6.4 శాతం నుండి 2011-2020లో 4.4 శాతానికి క్షీణించింది. ప్రధానంగా ప్రభుత్వ వ్యయంలో మందకొడిగా సాగుతున్న వృద్ధి, ప్రైవేట్‌ వ్యయం వృద్ధిలో గణనీయమైన క్షీణత కారణమని సర్వే తేల్చింది.

➡️