విద్యాహక్కు అమలులో దారుణ వైఫల్యం : ఉత్తరప్రదేశ్‌పై సుప్రీం ఆగ్రహం

  • 15న సమీక్ష

న్యూఢిల్లీ : ముజఫర్‌నగర్‌లో ఏడేళ్ల ముస్లిం చిన్నారిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బలు కొట్టించిన కేసులో ఉత్తరప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా తీవ్రమైన అంశమని, విద్యా హక్కు చట్టం అమలులో యోగి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించింది. ఉత్తరప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టం అమలుపై ఈ నెల 15న ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఈ చట్టం అమలుకు సంబంధించి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై వివరణాత్మక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని యోగి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తీవ్రమైన జాప్యం చేశారని, టీచర్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై చిన్నారి తండ్రి చేసిన ఫిర్యాదును కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు మండిపడింది. ముజఫర్‌నగర్‌లో ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌ ఆదేశాల మేరకు ఏడేళ్ల ముస్లిం చిన్నారిని తోటి విద్యార్థులు వరుస చెంప దెబ్బలు కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ పిటీషన్‌ వేశారు. ఈ పిటీషన్‌ను శుక్రవారం జస్టిస్‌ ఎఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ గరిమా ప్రసాద్‌ ధర్మాసనం ముందు హాజరయ్యారు. బాధిత ముస్లిం చిన్నారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు చైల్డ్‌లైన్‌, ముస్కాన్‌, హెచ్‌ఎక్యూ వంటి బాలల హక్కుల పరిరక్షణ ఏజెన్సీలను నియమించినట్లు తెలిపారు. చెంప దెబ్బలు కొట్టిన సహా విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్‌ ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. బాధిత విద్యార్థికి, సహచర విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ప్రారంభించనందుకు జనవరి విచారణలోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం చిన్నారులకు సురక్షితమైన వాతావారణం, గుర్తింపు పొందిన పాఠశాలలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులను అందించాలి. కులం, మతం, లింగం ఆధారంగా ఎలాంటి వివక్ష లేకుండా 14 ఏళ్ల వయసు వరకూ పిల్లలకు నాణ్యమైన, ఉచిత, నిర్బంధ విద్యను ప్రభుత్వం అందించాలి.

➡️