ఘనంగా డియెన్‌ బీన్‌ ఫు పోరాట 70వ వార్షికోత్సవాలు

హనోయి: మే 7 వియత్నాంలోని డియెన్‌ బీన్‌ ఫులో జరిగిన డియెన్‌ బీన్‌ ఫు పోరాటం విజయాన్ని స్మరించుకునే రోజు. ఫ్రెంచ్‌ వలసవాద సైన్యం వియత్నామీ పోరాట దళాల చేతిలో ఓడిపోయింది. దీంతో ఇండోచైనాపై ఫ్రెంచ్‌ ఆక్రమణకు తెరపడింది. డియెన్‌ బీన్‌ ఫు వద్ద, జనరల్‌ వో ఎంగుయెన్‌ గియాపి నేతృత్వంలోని వియత్నామీ దళాలు ఉత్తర-పశ్చిమ వియత్నాంలోని వారి పర్వత దండు వద్ద భారీ ఫిరంగి కాల్పులతో ఫ్రెంచ్‌ దళాలను చిత్తు చేశాయి. 1954లో వారి లంగుబాటు దాదాపు ఒక శతాబ్దపు ఫ్రెంచ్‌ వలస పాలనకు ముగింపు పలికింది.సిటీ సెంటర్‌లో ప్రధాన మంత్రి ఫామ్‌ మిన్‌ చిన్హ్‌ మాట్లాడుతూ, చారిత్రాత్మక విజయం ”వియత్నాం విప్లవానికే కాదు – ఇది ప్రపంచవ్యాప్తంగా వలసవాద పతనానికి ఒక చిహ్నం. స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం పోరాడటానికి ఇతర దేశాలను ప్రేరేపించిన ఒక గొప్ప సంఘటన” అని చెప్పారు. సైనిక కవాతులో వేలాది మంది స్థానికులు, వెటరన్‌ యోధులు, వియత్నామీస్‌ జెండాలను ఊపుతూ ఉత్సాహపరిచారు.వీరిలో 94 ఏళ్ల న్గుయెన్‌ ట్రూంగ్‌ డంగ్‌ కూడా ఉన్నారు. యుద్ధంలో అతను కలిసి పోరాడిన స్నేహితులను కలవడానికి ఈ సంఘటన తనకు మంచి అవకాశం అని అన్నారు.ఫ్రెంచ్‌ రక్షణ మంత్రి సెబాస్టియన్‌ లెకోర్నూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉన్నత స్థాయి ఫ్రెంచ్‌ అధికారి ఒకరు మాజీ యుద్ధభూమిని సందర్శించి, స్మారక కార్యక్రమాలకు హాజరు కావడం ఇదే మొదటిసారి.

➡️