‘నష్టాల కంపెనీలు’…. కోట్లలో ఎలక్టోరల్‌ బాండ్లు

న్యూఢిల్లీ : వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల(ఈబి)ను విరాళంగా ఇచ్చిన సుమారు 45 కంపెనీల నిధుల మళ్లింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నష్టాల్లో ఉన్న దాదాపు 33 కంపెనీలు రూ. 582 కోట్ల ఈబిల ద్వారా వివిధ పార్టీలకు విరాళాలు అందించగా, వాటిలో 75 శాతం బిజెపి ఖాతాల్లోకి వెళ్లడం గమనార్హం. ఈ నిధుల ప్రవాహంపై హిందూ, ఒక స్వతంత్ర పరిశోధనా బృందం సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ 45 కంపెనీలు నాలుగు కేటగిరీలుగా (A, B, C, D) విభజించాయి.
33 కంపెనీలు ఇచ్చిన ఈబిలలో మొత్తం రూ.576.2 కోట్ల విరాళంలో రూ.434.2 కోట్లు (దాదాపు 75 శాతం ) బిజెపికి అందాయి. 2016-17 నుండి 2022-23 వరకు ఏడు సంవత్సరాలలో ఈ కంపెనీలు నష్టాలు లేదా దాదాపు జీరో లాభాన్ని కలిగి ఉన్నాయి. ఈ 33 కంపెనీల మొత్తం నికర నష్టాలు రూ.1 లక్ష కోట్లకు పైగా ఉన్నాయి. ఈ 33 కంపెనీలలో 16 కంపెనీలు (కేటగిరీ ఎ) మొత్తంగా సున్నా లేదా ప్రతికూల ప్రత్యక్ష పన్నులను చెల్లించాయి. ఈ నష్టాలను మూటగట్టుకున్న కంపెనీలు గణనీయమైన విరాళాలు ఇచ్చాయని పరిశోధనలో వెల్లడైంది. అటే అవి ఇతర సంస్థలకు షెల్‌ కంపెనీలు అయి ఉండవచ్చు లేదా ఆ కంపెనీల లాభ, నష్టాలను తప్పుగా నివేదించడంతో మనీ లాండరింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.
ఆరు కంపెనీలు మొత్తం రూ.646 కోట్లను విరాళంగా ఇవ్వగా అందులో రూ.601 కోట్లు (93 శాతం ) బిజెపికి అందాయి. ఈ కంపెనీలు 2016-17 నుండి 2022-23 వరకు మొత్తంగా సానుకూల నికర లాభాలను కలిగి ఉన్నాయి. అయితే ఈబిల ద్వారా విరాళంగా ఇచ్చిన నగదు ఆ కంపెనీల మొత్తం నికర లాభాన్ని గణనీయంగా మించిపోయినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ కంపెనీలు (కేటగిరీ బి) వారి లాభనష్టాలను తప్పుగా నివేదించి ఉండవచ్చనని తెలిపారు.
మూడు కంపెనీలు మొత్తం రూ.193.8 కోట్లు విరాళంగా ఇవ్వగా, రూ.28.3 కోట్లు (సుమారు 15 శాతం ) బిజెపికి అందాయి. మిగిలిన వాటిలో కాంగ్రెస్‌ రూ.91.6 కోట్లు (47 శాతం ), తఅణమూల్‌ – రూ.45.9 కోట్లు (24 శాతం ), బి.ఆర్‌.ఎస్‌, బిజెడి – రూ.10 కోట్లు, (5 శాతం చొప్పున), ఆప్‌ – రూ.7 కోట్లు (3.6 శాతం) అందుకున్నాయి. ఈ మూడు కంపెనీలు సానుకూల నికర లాభాలను కలిగి ఉన్నాయి కానీ 2016-17 నుండి 2022-23 వరకు మొత్తంగా ప్రతికూల ప్రత్యక్ష పన్నులను నివేదించాయి. అటువంటి కంపెనీలు (కేటగిరీ సి) పన్ను ఎగవేతలు చేసి ఉండవచ్చు.
మూడు కంపెనీలు (కేటగిరీ డి) మొత్తం రూ.16.4 కోట్లను ఈబిలలో విరాళంగా ఇవ్వగా, అందులో రూ.4.9 కోట్లు (సుమారు 30 శాతం ) బిజెపికి అందాయి. మిగిలిన దానిలో కాంగ్రెస్‌ (58 శాతం ), అకాలీదళ్‌, జేడియులకు 6.1 శాతం చొప్పున ఈబిలు అందాయి. ఈ మూడు కంపెనీలు మొత్తం ఏడు సంవత్సరాల కాలానికి చెల్లించిన నికర లాభాలు లేదా ప్రత్యక్ష పన్నులపై నివేదించిన డేటా లేదు. అంటే ఈ కంపెనీలు మనీలాండరింగ్‌లో పాల్గన్న షెల్‌ కంపెనీలా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది.

➡️