Encounter: దండకారణ్యంలో దమనకాండ

Apr 16,2024 23:55 #Chhattisgarh, #encounter
  • పోలీస్‌ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి 
  • మృతుల్లో అగ్రనేత శంకరరావు?

దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రంలోను, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌ పెద్దయెత్తున రక్తపాతానికి దారి తీసింది. గత కొంత కాలంగా ఈ ప్రాంతం ఎన్‌కౌంటర్లతో గజగజ వణుకుతోంది. దండకారణ్యం ఖాకీల అరణ్యంగా మారిపోయింది. కూంబింగ్‌ ఆపరేషన్లతో గిరిజనులపై నిర్బంధం తీవ్రతరమైంది. మరో మూడు రోజుల్లో ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో 29 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయడం గమనార్హం. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత శంకరరావు కూడా ఉన్నట్లు ధ్రువీకరించని వార్తలను బట్టి తెలుస్తోంది. ఆయన తలపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఇది ఎన్‌కౌంటరేనని, బిఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌తో సహా ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయని ఈ ఆపరేషన్‌ నిర్వహించిన భద్రతా దళాల అధికారులు చెబుతున్నారు. మావోయిస్టులను పట్టుకుని కాల్చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రిస్తున్నారని మానవ హక్కుల, పౌరసంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాయ్ పూర్‌: వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతున్న దండకారణ్యంలో మంగళవారం మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. బస్తర్‌లో ఈ నెల 19న, కాంకర్‌లో 26న పోలింగ్‌ జరగనుండగా ఎన్నికల బందోబస్తు కోసం 60 వేల మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించారు. ఇంటెలిజెన్స్‌ నివేదికల ఆధారంగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌), జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ) బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని, కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో తమ దళాలు ఎదురుకాల్పులు జరిపాయని బీఎస్‌ఎప్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సుందర్‌రాజ్‌ తెలిపారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలాన్ని పరిశీలించగా 29 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. ఎన్‌కౌంటర్‌ స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయని తెలిపారు. ఎదురు కాల్పుల్లో గాయపడిన జవాన్లకు ప్రమాదమేమీ లేదని, మెరుగైన చికిత్స కోసం వారిని విమానంలో తరలించామని అన్నారు.
ఎన్‌కౌంటర్‌ స్థలం నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మధ్‌, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఉత్తర బస్తర్‌ ప్రాంతాలకు కూడలి అని సుందర్‌రాజ్‌ చెప్పారు. సంఘటనా స్థలంలో మావోయిస్టు సీనియర్‌ నాయకులు లలిత, శంకర్‌, రాజు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, దాని ఆధారంగానే డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్‌ సంయుక్త దళాన్ని అక్కడికి పంపామని వివరించారు. మావోయిస్టుల ఉత్తర బస్తర్‌ డివిజన్‌లో శంకరరావు, లలిత డివిజనల్‌ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్‌ మృతుల్లో వీరు కూడా ఉన్నారని తెలిసింది.
ఛోటే బెత్రియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సంఘటనా స్థలం నుండి మూడు ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్‌, ఒక ఏకే రైఫిల్‌, రెండు పిస్టల్స్‌, రెండు ఇన్సాస్‌ రైఫిల్స్‌, రెండు 303 రైఫిల్స్‌ వంటి ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. బినగుండ, దాని పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్‌ దళాలు సోమవారం రాత్రే గాలింపు చర్యలు ప్రారంభించాయి. ‘బినగుండ ప్రాంతంలో ఉత్తర బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారని మాకు కచ్చితమైన సమాచారం వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుండి ఆ ప్రదేశంలోనే వారు శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు’ అని బీఎస్‌ఎఫ్‌ వర్గాలు చెప్పాయి.
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గత సంవత్సరం నవంబర్‌ 7వ తేదీన పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిబ్బంది వెళుతుండగా మావోయిస్టులు పేలుడు పదార్థాలతో దాడి చేశారు. ఈ ఘటనలో పోలింగ్‌ సిబ్బందికి ఎస్కార్టుగా వెళుతున్న ఓ జవాను తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ పేలుడులో ఇద్దరు పోలింగ్‌ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ సంవత్సరం భద్రతా దళాలు మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకూ 50 మంది కిపైగా మావోయిస్టులను హతమార్చాయి. ఈ ఏడాది జరిగిన మావోయిస్టు హింసలో 18 మంది పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

➡️