మసకబారుతున్న మోడీ ప్రాభవం

May 8,2024 09:57 #modi

ఉత్తరాది రాష్ట్రాల్లోనూ
తగ్గిపోయిన ఛరిష్మా
-ప్రజా సమస్యల ముందు వెనక్కి పోయిన హిందూత్వ
– కాలం చెల్లిన మెజారిటీవాద రాజకీయాలు
న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ ముగిసింది. మరో నాలుగు విడతల పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఎన్‌డిఎ నేతలు కలలు కంటున్నట్లు 400కు పైగా స్థానాలు వచ్చే అవకాశాల్లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాలను దక్కించుకునే స్థితిలో కూడా ప్రస్తుతం ఎన్‌డిఎ లేదన్నారు. మోడీ మానియా క్రమేపీ అదృశ్యమవుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మోడీ ఛరిష్మాకు కాలం చెల్లిందనివిశ్లేషకులు అంటున్నారు.
2014, 2019 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం స్పష్టంగా కన్పించింది. అయితే ఇప్పుడది ఎక్కడా కానరావడం లేదు. మోడీ, ఇతర బిజెపి నేతల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతోంది. రెండో దశ పోలింగ్‌ ప్రచారం సందర్భంగా ప్రధానిలో అసహనం కన్పించింది. ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నారు. మైనారిటీలకు కాంగ్రెస్‌ కొమ్ము కాస్తోందని, హిందువుల సంపదను గుంజుకొని వారికి ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఓటర్ల మనోగతాన్ని పసిగట్టేందుకు పలువురు విశ్లేషకులు హిందీ రాష్ట్రాల్లో పర్యటించారు. 2019తో పోలిస్తే బిజెపి బలం తగ్గుతుందని వారు తేల్చి చెప్పారు. 2019లో హిందీ బెల్ట్‌లో బిజెపి గరిష్ట సంఖ్యలో స్థానాలు సాధించింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో మెజారిటీవాద రాజకీయాలు నడిపి ఓట్లు దండుకుంది. అయితే ఇప్పుడు ఆ వాతావరణం కన్పించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో మోడీ ప్రాభవం ఇప్పుడు మసకబారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రజా సమస్యలు ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిందూత్వ వాదం వెనక్కి పోయింది. మోడీకి కంచుకోటలుగా ఉన్న హిందీ రాష్ట్రాల్లో బిజెపి ఎన్ని స్థానాలు కోల్పోతుందో చూడాల్సి ఉన్నదని రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. అయితే సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాలను గెలుచుకునే స్థితిలో అయితే ఎన్‌డిఎ లేదని పేర్కొన్నారు.

➡️