గాజాలో దారుణ మారణకాండపై ఆరని ఆగ్రహ జ్వాలలు

Apr 29,2024 08:32 #washingtone

నిర్బంధాన్ని ఎదిరించి ముందుకు సాగుతున్న అమెరికాలోని యూనివర్సిటీ విద్యార్థులు
వాషింగ్టన్‌ :గాజాలో ఇజ్రాయిల్‌ ఊచకోతపై అమెరికాలో రగిలిన ఆగ్రహ జ్వాలలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. పాలస్తీనాపై దురాక్రమణకు పాల్పడుతూ, దారుణ మారణకాండకు కారణమవైన యూదు దురహంకార ఇజ్రాయిల్‌కు యూనివర్సిటీ నిధులను మళ్లించడాన్ని ఆపాలని, ఆయుధాలు, నిధుల సరఫరాకు తక్షణమే స్వస్తి పలకాలని కోరుతూ గత కొన్ని రోజులుగా అమెరికా అంతటా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతున్న ఈ ఉద్యమం రెండు ప్రధాన పాలకవర్గ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. క్యాంపస్‌లలో గుడారాలు వేసుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బైడెన్‌ ప్రభుత్వం పెద్దయెత్తున నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది.వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసింది. కొందరిని క్యాంపస్‌ నుంచి బహిష్కరించింది. పోలీసులను పెద్దయెత్తున మోహరించి నిరసన గుడారాలను బలవంతంగా తొలగించేందుకు యత్నించింది. విద్యార్థులపై పోలీసులు పిప్పర్‌ బాల్స్‌, టియర గ్యాస్‌ షెల్స్‌ను ప్రయోగించారు. ఇటువంటి వాటికి తాము భయపడేది లేదని, పాలస్తీనాపై దురాక్రమణను, ఊచకోతను ఆపాలన్న డిమాండ్‌పై తాము తగ్గేదే లే అని విద్యార్థులు స్పష్టం చేశారు. నిర్బంధాన్ని ఎదిరించి వీరోచితంగా పోరాడుతున్న అమెరికన్‌ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రపంచ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. అమెరికా విద్యార్థుల పోరాటానికి మద్దతుగా శుక్రవారం ఎమెన్‌ రాజధాని సనా స్క్వేర్‌లో భారీ మార్చ్‌ నిర్వహించారు. ఈ మార్చ్‌లో లక్షలాది మంది యెమెన్‌ ప్రజలు పాల్గొని ఇజ్రాయిల్‌ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నినదించారు. ఫ్రాన్స్‌లో కూడా వీరికి సంఘీభావంగా ప్రదర్శనలు జరిగాయి. ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి కూడా వీరి పోరాటాన్ని అభినందిస్తూ సందేశాలు వస్తున్నాయి.
ఈ ఆందోళనలకు ప్రధాన కేంద్రంగా ఉన్న కొలంబియా యూనివర్సిటీలో నిరసన శిబిరాలను ఖాళీ చేయించాలని చూసిన పోలీసులకు విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. యేల్‌, న్యూయార్క్‌, మిచిగాన్‌, ఓహియో, హోస్టన్‌, సదరన్‌ కాలిఫోర్నియా, ఇలా అన్ని యూనివర్సిటీలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొన్నందుకు భారత సంతతికి చెందిన విద్యార్థిని శివలింగమ్‌ను యూనివర్సిటీ నుంచి యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఆమె పాలస్తీనా ప్రజలకు తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. గాజాలో ఇజ్రాయిల్‌ దారుణ మారణకాండకు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరూ బాధ్యులేనని నిరసనకారులు విమర్శిస్తున్నారు. వీరి మద్దతుతోనే నెతన్యాహు 25వేల మంది మహిళలు, పిల్లలతో సహా 34వేల మంది అమాయక పౌరుల ప్రాణాలు తీశాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అట్లాంటాలోని ఎమోరా యూనివర్శిటీలో శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై యాజమాన్యం ఆదేశాలతో పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ దృశ్యాలు తన యుక్తవయసులో గ్వాటెమాలాలో జరిగిన అంతర్యుద్ధాన్ని గుర్తుకు తెస్తున్నాయని ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ ఎమిల్‌ కెమె తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను పోలీసులు రబ్బరు బుల్లెట్లు, వాటర్‌ కెనాన్లు, టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. ఇదంతా చూస్తుంటే తాము యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నానా, లేక యుద్ధ ప్రాంతంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. వీరికి మానవ హక్కుల గ్రూపులు, ప్రతిఘటనా బృందాలు, వామపక్ష, ప్రజాతంత్రవాదులు సంఘీభావంగా నిలిచారు.
గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావంగా విద్యార్థులు ఈ నిరసనలు చేపడుతున్నారు. ఇజ్రాయిల్‌తో ముడిపడి ఉన్న అంశాలు, గాజాలో యుద్ధానికి ఆజ్యం పోసే ఆయుధాలకు యూనివర్శిటీలు ఫండ్స్‌ నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. బ్లాక్‌రాక్‌, గూగుల్‌, అమెజాన్‌ క్లౌడ్‌ సర్వీస్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, ఎయిర్‌బిఎన్‌బిలు నిధులను మళ్లిస్తున్నట్లు తెలిపాయి.
ఇద్దరు మహిళా ప్రొఫెసర్లపై పోలీసుల దాష్టీకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వారిలో ఒకరిని పోలీస్‌ అధికారులు నేలపై పడేసి చేతులు వెనక్కి కట్టేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
అట్లాంటా పోలీసులు, జార్జియా ట్రూపర్లు సంయుక్తంగా యూనవర్శిటీలో ఏర్పాటు చేసిన శిబిరాలను ధ్వంసం చేశారు. క్యాంపస్‌లో ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే 28 మందిని అరెస్టు చేశారు.

➡️