విదేశీ విద్యార్థుల హాస్టల్‌ మారుస్తాం : గుజరాత్‌ యూనివర్శిటీ

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ యూనివర్శిటీకి చెందిన విదేశీ విద్యార్థులను మూడు రోజుల్లో మరో కొత్త హాస్టల్‌కు మార్చనున్నట్లు వైస్‌ ఛాన్సలర్‌ నీరజ తెలిపారు. యూనివర్శిటీ తన హాస్టల్‌ బ్లాకుల భద్రత పటిష్టం చేయడానికి మాజీ ఆర్మీ సిబ్బందిని నియమించాలని భద్రతా ఏజన్సీలను ఆదేశించినట్లు ఆమె సోమవారం తెలిపారు. స్టడీ అబ్రాడ్‌ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌, హాస్టల్‌ వార్డెన్‌లను మార్చినట్లు చెప్పారు. విదేశీ విద్యార్థుల కోసం సలహా కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలో స్టడీ అబ్రాడ్‌ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌, లీగల్‌ సెల్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, యూనివర్శిటీ లోక్‌పాల్‌ సభ్యులుగా ఉంటారని అన్నారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ బాలుర హాస్టల్‌లో రంజాన్‌ సందర్భంగా నమాజ్‌ చేస్తున్న నలుగురు విదేశీ విద్యార్థులపై శనివారం అర్థరాత్రి ఓ గుంపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హితేష్‌ మేవాడా, భరత్‌ పటేల్‌లను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ తరుణ్‌ దుగ్గల్‌ పేర్కొన్నారు.

➡️