అసహనం మాటున… ముస్లింలే లక్ష్యంగా మోడీ వ్యాఖ్యలు

May 5,2024 00:53 #coments, #Muslim Conference, #PM Modi
  • హిందువుల్లో విష బీజాలు నాటేందుకు యత్నం
  •  ద్వేషపూరిత వీడియోలతో ప్రచారం
  •  ‘ఓట్‌ జిహాద్‌’ పేరుతో వక్రభాష్యం

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలు సన్నగిల్లుతుండడంతో కమలదళంలో అసహనం పెరిగిపోతోంది. మతాల మధ్య చిచ్చు పెట్టి ఎలాగైనా ఓట్లు దండుకోవాలన్న ఆలోచన వారిలో మొదలైంది. ముస్లిం మైనారిటీలపై విషం చిమ్ముతూ మెజారిటీ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటిత పరచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీని కూడా ఈ ఉచ్చులోకి లాగి దానిపై అసత్య ఆరోపణలు చేసేందుకు కమలనాథులు వెనుకాడడం లేదు.
ఈ వారం ప్రారంభంలో ప్రధాని మోడీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు ముస్లింలతో కాంగ్రెస్‌ కుమ్మక్కు అయిందని ఆరోపించారు. ‘ఓట్‌ జిహాద్‌ చేయాలని ముస్లింలను ప్రతిపక్ష ఇండియా కూటమి కోరుతోంది. ఇప్పటి వరకూ మనం లవ్‌ జిహాద్‌, ల్యాండ్‌ జిహాద్‌ గురించే విన్నాము. ఇది కొత్త పదం’ అంటూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. జిహాద్‌ అంటే అర్థమేమిటో, దానిని ఎవరిపై ప్రయోగిస్తారో ప్రజలకు తెలుసునని చెప్పారు.

ముస్లింలలో భయాందోళనలు
దేశంలో మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ తన ప్రచారాన్ని ఉదృతం చేశారు. ఇటీవలి కాలం వరకూ బిజెపికి మద్దతు తెలిపిన ముస్లింలు కూడా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ వ్యాఖ్యలు దేశంలోని ముస్లింలపై భౌతిక దాడులను ప్రేరేపిస్తాయని ముస్లింలు భయాందోళనలు చెందుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ స్థానిక నేత మరియా ఆలం ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఓట్ల జిహాద్‌ చేపట్టాలని, అదొక్కటే జిహాద్‌ అని, దాని ద్వారానే మోడీని అధికారం నుండి దింపేయగలమని ముస్లింలకు పిలుపునిచ్చారు. ఆలం తన ప్రసంగంలో జిహాద్‌ అనే పదాన్ని ఉపయోగించడంపై మోడీ మండిపడ్డారు. జిహాద్‌ అంటే అరబ్‌ భాషలో ఆందోళన అని అర్థమని ఆలం వివరణ ఇచ్చినా, మోడీ వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నారు.
విష బీజాలు నాటేందుకే…
ప్రధాని మాటలు దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శకులు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలు భారత్‌ను ఇబ్బంది పెడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం కూడా మోడీ ముస్లింలను చొరబాటుదారులుగా అభివర్ణించారు. వారు అధిక సంతతిని కలిగి ఉంటారని ఎద్దేవా చేశారు. ముస్లింలు ఎక్కువ మంది సంతానాన్ని కంటారని, హిందూ జనాభాను అధిగమించడమే వారి అంతిమ లక్ష్యమని చెప్పడం ద్వారా మెజారిటీ వర్గమైన హిందువుల్లో విష బీజాలు నాటడమే ప్రధాని ఉద్దేశంగా కన్పిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

దుమారం రేపిన వీడియో
మోడీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుండే కాకుండా పౌర సమాజం నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మోడీ విద్వేషపూరిత ప్రసంగంపై చర్యలు తీసుకోవాలని సుమారు 20 వేల మంది పౌరులు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నప్పటికీ మోడీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హిందూ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్‌, ముస్లింలు కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. గత నెల 30న బిజెపి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యానిమేటెడ్‌ ప్రచార వీడియోను ప్రదర్శించింది. భారతదేశంపై దాడి చేసి సంపదను దోచుకోవడానికి ముస్లింలు వచ్చారని, ఆ సమయంలో మోడీ వచ్చి దేశాన్ని కాపాడారని ఆ వీడియోలో చూపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే హిందూ సంపదను, ఆస్తులను ముస్లింలకు పంచుతుందని మోడీ చేసిన వ్యాఖ్యను కూడా ఈ వీడియోలో చూపారు. దీనిపై దేశంలో రాజకీయ దుమారం రేగింది. వీడియోపై ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దానిని ఆ తర్వాత తొలగించారు. అయితే మోడీపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని మోడీ కించపరిచారని, ప్రధాని నోటి నుండి అలాంటి మాటలు రాకూడదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ప్రమోద్‌ తివారీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఎన్నికల కమిషన్‌ నిద్ర పోతోందని ఆయన చెప్పారు. మోడీ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేయాలని, ప్రచారం నిర్వహించకుండా ఆయనను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. మోడీ విద్వేష వ్యాఖ్యల కారణంగా ముస్లింలు హింసకు గురయ్యే ప్రమాదం ఉందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారు మద్దతు ఇస్తున్న కారణంగా హిందూత్వ శక్తులు పెట్రేగిపోయే అవకాశం ఉన్నదని, తాము ఏమి చేసినా రక్షణ ఉంటుందని వారు భావిస్తారని సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సొసైటీ అండ్‌ సెక్యులరిజం డైరెక్టర్‌ ఇర్ఫాన్‌ ఇంజనీర్‌ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రసంగాలను పరిశీలించాల్సిన ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోందని ఆయన చెప్పారు.

➡️