పార్లమెంటులో పొగబాంబు కేసులో నిందితుల ఫోన్ల అవశేషాలు స్వాధీనం

Dec 18,2023 08:11 #Bomb Attack, #Evidence, #Parliament
Police recover pieces of burnt phone, evidence destruction charges to be added in Parliament breach case

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో పొగ బాంబులు పేల్చిన కేసులో పగులగొట్టి, దగ్ధం చేసిన నిందితుల మొబైల్‌ ఫోన్లను రాజస్థాన్‌లోని నగౌర్‌ వద్ద ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో నిందితులపై ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి సంబంధించిన సెక్షన్లను కూడా జత చేశారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఆరుగురు నిందితుల్లో ఒకరైన లలిత్‌ ఝూ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ ఫోన్ల తునకలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం లలిత్‌ను నగౌర్‌కుఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ బృందం తీసుకెళ్లింది. కేసుకు సంబంధించిన సాంకేతిక సాక్ష్యాలను నాశనం చేసేందుకే ఉద్దేశ్యపూర్వకంగానే ఫోన్లను పగులగొట్టడం, దగ్ధం చేయడం వంటివి చేశారని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌లో ఐపిసి సెక్షన్‌ 201ను జత చేశారు. పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం కేసులో ఇప్పటికే సాగర్‌ శర్మ, మనోరంజన్‌, అమోల్‌ షిండే, నీలం దేవి, లలిత్‌ ఝూ, మహేష్‌ కమావత్‌లను అరెస్టు చేశారు. ఈ నెల 13న ఇప్పటికే వీరిపై ఉపా చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

భద్రతా ఉల్లంఘన తీవ్రమైన అంశమే రాజకీయాలు చేయొద్దు : ప్రధానిమోడీ
చర్చ నుంచి ప్రధాని పారిపోతున్నారు : జైరాం రమేశ్‌ కౌంటర్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ భద్రత ఉల్లంఘన ఘటన తీవ్రమైన అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని, ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని సుద్దులు చెప్పారు. ఈ నెల 13న ఘటనపై పార్లమెంట్‌లో చర్చ జరిపి, హోం మంత్రి అమిత్‌షా సమాధానం ఇవ్వాలను ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంగీకరించకపోగా, ఆందోళన చేసిన ఎంపిలను సస్పెండ్‌ చేసింది. దీంతో, మిగిలిన ప్రతిపక్ష ఎంపిలు ఆందోళన కొనసాగిస్తుండటంతో, ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. గత కొనిు రోజులుగా ఈ అంశంపై స్పందించని ప్రధాని ఆదివారం దైనిక్‌ జాగరణ్‌ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి మాట్లాడారు. ‘ఈ ఘటన బాధాకరమైన, ఆందోళన కలిగించే అంశం. దీనిపై దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో దీనివెనుక ఉను వ్యక్తుల మూలాలను, వారి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరం’ అని అన్నారు.

బిజెపి ఎంపి పాత్రపై ప్రశ్నలు వస్తాయనే చర్చకు దూరంగా మోడీ.. : కాంగ్రెస్‌

మైసూర్‌ బిజెపి ఎంపి పాత్రపై ప్రశులు వస్తాయనే పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై చర్చ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరంగా పారిపోతున్నారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ‘డిసెంబరు 13న జరిగిన అసాధారణ ఘటనలపై ప్రధాని మోడీ ఎట్టకేలకు మౌనం వీడారు. అయితే విచారణ అవసరమని, చర్చ కాదని ప్రధాని తెలిపారు’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘ఇండియా ఫోరంలోని అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నదీ, ఒత్తిడి కొనసాగిస్తున్నది డిసెంబరు 13న ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేదానిపై హోం మంత్రి ప్రకటన కోసమే’ అని పోస్టు చేశారు. నిందితులు సులభంగా లోక్‌సభలో ప్రవేశించడంలో బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా పాత్రపై ప్రశులు వస్తాయనే మోడీ చర్చ నుంచి పారిపోతున్నారని పేర్కొన్నారు.

➡️