దేశంలో ప్రయివేటు అణు కుంపట్లు !

Private nuclear reactors in the country!
  • రూ.2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆహ్వానం
  • బరిలో రిలయన్స్‌, టాటా, అదానీ, వేదాంత

న్యూఢిల్లీ : దేశంలో ప్రయివేటు అణు కుంపట్లు రాజేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చాప కింద నీరులా కసరత్తు చేస్తోంది. అణు విద్యుత్‌ రంగంలో ఏకంగా 2.16 లక్షల కోట్ల (2600 కోట్ల డాలర్ల) మేర ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రిలయన్స్‌ ఇండిస్టీస్‌, టాటా పవర్‌, అదానీ పవర్‌, వేదాంత లిమిటెడ్‌ తదితర సంస్థలతో మోడీ సర్కార్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అణు విద్యుత్‌ రంగంలో ఈ సంస్థలు ఒక్కొక్కటి రూ.44 వేల కోట్లు మేర పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అణు విద్యుత్‌ రంగంలో భారత్‌ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం తొలి సారి. కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలను వెలువరించని వనరుల నుండి విద్యుత్‌ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యమని సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో అణు విద్యుత్‌ ఉత్పత్తి కేవలం 2 శాతం కన్నా తక్కువగానే వుంది. 2030 కల్లా శిలాజయేతర ఇంధనాలను ఉపయోగించి ప్రస్తుతమున్న 42 శాతం విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 50 శాతానికి పెంచాలన్న లక్ష్య సాధన పేరుతో ప్రయివేటు అణు విద్యుత్‌ క్షేత్రాలను ఏర్పాటు చేయాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది. ఈ పెట్టుబడులతో 2040 కల్లా 11 వేల మెగావాట్ల కొత్త అణు విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.

➡️