ఒబిసిలు, దళితుల సాధికారతలో మోడీ ప్రభుత్వం విఫలం

rahul gandhi speech in nagapur

 

నాగపూర్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవ సభలో రాహుల్‌గాంధీ

నాగపూర్‌ : ఒబిసిలు, దళితుల సాధికారతలో మోడీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా వేదిక అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన ‘హైన్‌ తైయార్‌ హమ్‌’ (మేము సిద్ధంగా ఉన్నాం) ర్యాలీలో ఆయన ప్రసంగించారు. జనాభాలో 50 శాతంగా ఉన్న ఒబిసిలు, దళితులు, ఆదివాసీలకు అనేక రంగాలలో ప్రాతినిధ్యం కరువైందని చెప్పారు. ఒబిసిలు, దళితులు, గిరిజనుల కోసం పనిచేస్తున్నామని మోడీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన చెబుతోంది? అధికారం పంచుకునే ప్రక్రియలో అవి ఎందుకు భాగం కావు?’ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందని అన్నారు. బిజెపి బిజెపి బానిసల పార్టీ అని, గతంలో బ్రిటిష్‌ ప్రభుత్వంతో కుమ్మక్కైన రాచరిక పాలకులను పోలి ఉందని విమర్శించారు. దేశంలోని ప్రతి సంస్థ – అది మీడియా, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ – అధికార పార్టీచే నియంత్రించబడుతున్నాయని చెప్పారు. షరతులు లేని, విధేయతను కోరే, ఎవరి మాట వినని నాటి రాజుల లాంటి పాలనే బిజెపి సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. పదేళ్ల బిజెపి పాలనలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోడీ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ 2024లో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ముగిసిపోతుందని అన్నారు. ఈ సభలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు, మహారాష్ట్రకు చెందిన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️