”రూ.8,000 ఐదేళ్లకు సరిపోతాయి”… కోటా నుండి అదృశ్యమైన విద్యార్థి మెసేజ్‌

కోటా  :   తన దగ్గర రూ.8,000 ఉన్నాయని, ఐదేళ్లకు సరిపోతాయంటూ కోటాలోని ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు సందేశం పంపాడు. రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కి ప్రిపేరవుతున్న 19 ఏళ్ల విద్యార్థి రాజేంద్ర మీనా సోమవారం నుండి కనిపించడం లేదు. అతని తండ్రి జగదీష్‌ మీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు.

వివరాల ప్రకారం.. గంగారాంపూర్‌లోని బమన్‌వాస్‌కు చెందిన రాజేంద్ర నీట్‌ ప్రిపేరయ్యేందుకు కోటాలో చేరాడు. పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్న నివాసం నుండి మే 6వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు బయటకు వెళ్లాడు. అప్పటి నుండి విద్యార్థి కనిపించడం లేదు. విద్యార్థి మొబైల్‌ నుండి మెసేజ్‌ రావడంతో తల్లిదండ్రులకు అతను కనిపించడం లేదన్న సమాచారం తెలిసింది.

”నేను ఇంటినుండి వెళ్లిపోతున్నాను. చదువును కొనసాగించడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర రూ. 8,000 ఉన్నాయి. ఇవి ఐదేళ్లకు సరిపోతాయి. నేను మొబైల్‌ను అమ్మి, సిమ్‌కార్డును ధ్వంసం చేస్తాను. నాగురించి బెంగపడవద్దని అమ్మకు చెప్పండి. నేను ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోను. అందరి ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. అవసరమైతే.. నేనే ఫోన్‌ చేస్తాను. ఏడాదికి ఒకసారి తప్పకుండా ఫోన్‌ చేస్తాను” అని మెసేజ్‌లో పేర్కొన్నాడు.

కోటాలోని పోటీ వాతావరణంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఈ సంఘటన మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. సమాచారం లేకుండా కోటా నుండి పలువురు విద్యార్థులు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒత్తిడి తట్టుకోలేక  పలువురు విద్యార్థులు   ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.    ఇకనైనా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు చదువు పేరుతో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడాల్సి వుంది.

➡️