మధ్యప్రదేశ్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. పోలీస్‌ అధికారిని ట్రాక్టర్‌తో చంపించిన వైనం

భోపాల్‌ :    అక్రమ మైనింగ్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్‌ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సెహ్డోల్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేంద్ర బగ్రీ, ఇద్దరు కానిస్టేబుల్స్‌ ప్రసాద్‌ కానోజి, సంజరు దూబేలతో కలిసి శనివారం ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ తనిఖీకి వెళ్లారు. వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఆపేందుకు యత్నించగా .. ఆయనను తొక్కుకుంటూ వెళ్లడంతో మహేంద్ర బగ్రీ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన నుండి కానిస్టేబుల్స్‌ తప్పించుకోగలిగారని అధికారులు తెలిపారు. డ్రైవర్‌, అతని సహాయకుడిని అదుపులోకి తీసుకున్నామని, ట్రాక్టర్‌ యజమాని పరారీలో ఉన్నారని అన్నారు.

ట్రక్కు యజమాని గురించి సమాచారం అందించిన వారికి రు.30,000 రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఇసుక మాఫియాలో కీలక నిందితులు అశుతోష్‌ సింగ్‌, సురేంద్ర సింగ్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో సోన్‌ నది నుండి ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా సాగుతోంది.

గతేడాది నవంబర్‌లో షెహదోల్‌ ఇసుక మాఫియాకు చెందిన ట్రాక్టర్‌లో రెవెన్యూ శాఖ అధికారి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే.

➡️