తమిళనాట ముగిసిన ప్రచార హోరు

Apr 18,2024 02:43 #2024 elections, #Polling, #Puducherry
  • రేపు పుదుచ్చేరి సహా 40 స్థానాల్లో పోలింగ్‌

ప్రజాశక్తి – చెన్నయ్ : తమిళనాడులో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. చివరిరోజు అన్ని పార్టీలకు చెందిన నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేశారు. నేతల ఉపన్యాసాలతో 40 ఎంపి నియోజకవర్గాలూ (పుదిచ్చేరి సహా) హోరెత్తాయి. శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రద సాహు చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె (ఇండియా కూటమి), అన్నాడిఎంకె (మినీ కూటమి), బిజెపి సారథ్యంలో ఎన్‌డిఎ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఒంటరిగా నామ్‌ తమిళర్‌ కచ్చ్‌ పోటీలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బిజెపి అగ్రనేతలు తమిళనాడుపై కేంద్రీకరించారు. ఎన్‌డిఎ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొమ్మిదిసార్లు, బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమిని బలపరుస్తూ ఎఐసిసి నేత రాహుల్‌గాంధీ రెండుసార్లు విచ్చేశారు. డిఎంకె ముఖ్యమంత్రి స్టాలిన్‌, యువజన సేత ఉదయనిధి స్టాలిన్‌, డిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి ప్రచారం చేశారు. సిపిఎం మదురై, దిండిగల్‌ ప్రాంతాల్లోనూ, సిపిఐ నాగపట్నం, తిరుపూర్‌లో పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మదురైలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రచారం చేశారు. చెన్నరులో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సుడిగాలి పర్యటన చేస్తూ మోడీ మళ్లీ అధికారంలోకి రాకుండా, దేశ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి లౌకికవాదాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ప్రచార పర్వం ముగియడంతో నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం ఓటింగ్‌కు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఎన్నికల నేపథ్యంలో 19న సినిమా షోలను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

➡️