రాష్ట్రానికి ముగ్గురు పరిశీలకులు

– 8 రాష్ట్రాలకు 17 మంది
– నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. జనరల్‌ స్పెషల్‌ పరిశీలకులుగా మాజీ ఐఎఎస్‌ అధికారి రామ్మోహన్‌ మిశ్రా, పోలీస్‌ స్పెషల్‌ పరిశీలకులుగా మాజీ ఐపిఎస్‌ అధికారి దీపక్‌ మిశ్రా, ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి నీనా నిగమ్‌ను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు 17 మందిని పరిశీలకులుగా నియమించింది. ఎన్నికల వేళ పలు కీలక రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నట్లు వెల్లడించింది. అందుకోసం మాజీ అఖిల భారత సర్వీస్‌ అధికారులతోపాటు మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న ఉన్నతాధికారుల సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ధన ప్రభావం, కండ బలం, తప్పుడు సమాచారం తదితర అంశాలపై దృష్టి సారిస్తారని ఇసి తెలిపింది. ఏడు కోట్లకుపైగా జనాభా కలిగిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రతోపాటు బీహార్‌కు పరిశీలకులను పంపుతున్నట్లు పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాకు సైతం వీరిని పంపుతున్నామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఒడిశాలో అభ్యర్థుల ఎన్నికల సంబంధిత ఖర్చులపై నిఘా కోసం ప్రత్యేక వ్యయ పరిశీలకులను నియమిస్తున్నట్లు తెలిపింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను అతిక్రమించొద్దని సూచించింది. మరోవైపు సి విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి మార్చి 29 వరకు 79 వేల ఫిర్యాదులు అందాయని చెప్పింది. మార్చి 16 నుంచి ఈ ఫిర్యాదులు అందాయని పేర్కొంది.

➡️