కప్పుకునేందుకు దుప్పట్లు లేవు

Dec 6,2023 10:59 #Tufan
  • చలిని తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతున్న నిర్వాసితులు
  • బోసిపోయిన పునరావాస కేంద్రం

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా): పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు దుప్పట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. చలికి తట్టుకోలేక గజగజ వణుకుతూ ఆ కేంద్రంలో ఉండలేక నిర్వాసితులు ఇంటికి తిరుగుముఖం పట్టారు. అల్పాహారం, భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా…నిర్వాసితులు లేక పునరావాస కేంద్రాలు బోసిపోయాయి.తుపాను నేపథ్యంలో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సూరాడు పేటలోని పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సూరాడిపేట, మాయాపట్నం, గగోలిపేట, గాంధీనగర్‌ తదితర తీర ప్రాంత మత్స్యకారులను ఈ కేంద్రానికి తరలించాల్సి ఉంది. పునరావాస కేంద్రానికి 400 మందిని తరలించామని అధికారులు చెబుతున్నారు. కాని మంగళవారం సాయంత్రానికి అక్కడ 50 మంది కూడా లేరు. దుప్పట్లను ఇవ్వకపోవడంతో చలితీవ్రతను తట్టుకోలేక వారు ఇళ్లకు వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. అల్పాహారం, భోజనం సమయంలో మాత్రమే నిర్వాసితులు వచ్చి వెళ్లిపోతున్నారు. చలిని తట్టుకోలేక ఇంటికి వెళ్లి పోతున్నాంపునరావాస కేంద్రంలో భోజన సౌకర్యాలు మాత్రమే కల్పించారు. కప్పుకునేందుకు దుప్పట్లను ఇవ్వలేదు. చలిని తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతున్నాం. అధికారులు దుప్పట్లను అందించి ఉంటే పునరావాస కేంద్రంలోనే ఉండేవాళ్లం- డోనె పేతురు, సూరాడుపేట, నిర్వాసితుడు

➡️