గుర్తింపులేని జనసేనకు ఎందుకు ఆహ్వానం..? : విజయసాయిరెడ్డి

Jan 9,2024 15:15 #press meet, #vijayasaireddy

అమరావతి: ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ బఅందాన్ని అధికార వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్‌లు కలిశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఈసీకి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాం అన్నారు. అయితే, జనసేనకి గుర్తింపు లేకున్నా ఎందుకు ఆహ్వానించారని అడిగాం. పొత్తులో భాగంగా టీడీపీ అడిగిందని చెప్పారన్నారు. గ్లాస్‌ గుర్తు సాధారణ గుర్తు.. సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం అన్నారు. కోనేరు సురేష్‌ అనే వ్యక్తి సీఈవోకి కంప్లైంట్‌ ఇచ్చారు.. ఇతను టీడీపీలో కీలకంగా వ్యవహారిస్తున్నాడని.. కర్నూల్‌ జిల్లాలో 67,370 బోగస్‌ ఓట్లు ఉన్నాయని సురేష్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు.. కానీ, అక్కడ వెరిఫికేషన్‌ చేశాక 87శాతం నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించారని తెలిపారు.ఈసీ వెరిఫికేషన్‌ అనంతరం చాలా వరకు సరైన ఓటర్లు ఉన్నారని గుర్తించారని పేర్కొన్నారు సాయిరెడ్డి.. తప్పు దోవ పట్టించిన కోనేరు సురేష్‌ వంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు. ఇక, రెడ్‌ బుక్‌ పేరుతో అధికారులపై నారా లోకేష్‌ చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాం అన్నారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు కూడా ఒకేసారి లోక్‌ సభ ఎన్నికలు పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు వెల్లడించారు.

➡️