నాలుగేళ్లలో 2.17 లక్షల కోట్ల రుణం : కేంద్రానికి వివరించిన రాష్ట్రం

Dec 10,2023 11:05 #Centre, #crore, #debt, #explained, #four, #lakh, #State

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో 2.17 లక్షల కోట్ల రుపాయల అప్పు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది. కొద్దిరోజులుగా కేంద్రం రాష్ట్రం చేసిన రుణాలపై వివిధ రూపాల్లో ఆరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ గడిచిన నాలుగేళ్ల కాలంలో చేసిన రుణాల వివరాలను ప్రకటించింది. నాలుగేళ్లలో తీసుకున్న రుణాలు, ఏయే రంగాల ద్వారా ఎంత తీసుకున్నారు తదితర అంశాలను వెల్లడించింది. ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖా పెట్టడం ద్వారా నేరుగా రిజర్వ్‌బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలతోపాటు, నబార్డ్‌, హడ్కో, ఎల్‌ఐసి, ఎన్‌సిడిసి వంటి సంస్థల నుంచి, ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల కోసం సేకరిరచిన రుణాలను కూడా రాష్ట్ర ఆర్థికశాఖ ప్రకటించింది.2019-20 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 2,17,883 కోట్లు రుణాలుగా సేకరించినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందులో ఒక్క రిజర్వ్‌బ్యాంకు నుంచి సెక్యూరిటీల వేలం ద్వారా నుంచే 1,97,232 కోట్లు సమీకరించారు. అలాగే నబార్డ్‌ నుంచి 7,122 కోట్లు, సంస్థల నుంచి 6,509 కోట్లు, ఇఏపి వంటి వాటికి 7,020 కోట్లు తీసుకున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.జిఎస్‌డిపిలో 33.7 శాతంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు ప్రస్తుతం జిఎస్‌డిపిలో 33.7 శాతంగా ఉన్నట్లు ఆర్థికశాఖ పేర్కొంది. 2019-20లో 27.9 శాతంగా ఉండగా, 2020-21లో 34.7 శాతానికి పెరిగింది. తరువాత 2021-22లో 35.6 శాతానికి పెరగ్గా, 2022-23లో స్వల్పంగా తగ్గి 33.7 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. అలాగే రిజర్వ్‌బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల్లో ఇప్పటివరకు 41,374 కోట్లు తిరిగి చెల్లింపులు చేసినట్లు తెలిపింది.

 

➡️