58 నెలల్లో రూ.2.78 కోట్లు

Apr 30,2024 00:01 #2024 election, #cm jagan
  • 85 శాతం మంది ప్రజలకు అందించాం
  •  చంద్రబాబు పేరుచెబితే ఒక్క పథకమైనా గురుస్తోందా?
  •  పొన్నూరు, అంబాజీపేట, కొత్తూరు సభల్లో సిఎం జగన్‌

ప్రజాశక్తి- యంత్రాంగం : 58 నెలల కాలంలో 85 శాతం మంది ప్రజలకు రూ.2.78 లక్షల కోట్లు అందించానని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన చంద్రబాబు ఎంత మంది ప్రజలకు మేలు చేశారని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు ఎన్‌డిఎ కూటమి ఆధ్వర్యంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక్క పథకం అయినా పూర్తిగా అమలు చేశారా?, చంద్రబాబు పేరుచెబితే గుర్తుకు వచ్చే ఒక్క మంచిపథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు, బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. తనను బచ్చా అని పిలుస్తున్న చంద్రబాబుకు రాజకీయంగా తగిన సత్తా ఉంటే ఇన్ని పార్టీలతో పొత్తులెందుకని ప్రశ్నించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డిజిటల్‌ లైబ్రరీ, విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌, నాడు-నేడులో పాఠశాలలు అభివృద్ధి చేశామని, చంద్రబాబు తన 14 ఏళ్ల కాలంలో ఇవ్వన్నీ ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలన్నారు. గత ఐదేళ్లలో 2.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చానని, చంద్రబాబు ఇంతమందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన మంత్రి వర్గంలో 68 శాతం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు స్థానం కల్పించానని తెలిపారు. చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోటిలో తలకాయ పెట్టినట్లేనని, సాధ్యం కాని హామీలిచ్చి అమలు చేయకుండా మోసగిస్తారని, ఇది ఆయన గత చరిత్ర చెబుతున్న సత్యమని వివరించారు. గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి, జాబు వచ్చే వరకు రెండు వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తానని నమ్మించి మోసగించారన్నారు. ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదా, విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీ గోవిందా చేశారని విమర్శించారు. సింగపూర్‌ను మించిన రాజాధాని చేస్తానని నమ్మించి, అన్ని హంగులున్న వైజాగ్‌ను వదిలేశారని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను గోవిందా చేశారని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డ పుడితే బ్యాంకు అకౌంట్‌లో రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, తరువాత ఒక్క రూపాయి కూడా బ్యాంకులో వేయలేదన్నారు. చంద్రబాబు సిఎంగా ఉన్న 14 ఏళ్లలో దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం తప్ప చేసేందేమిలేదన్నారు. కూటమి పేరుతో మోసాల చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ బిజెపితో జతకట్టారని, ఇదే కూటమి 2014లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ విస్మరించిందన్నారు. ఇప్పుడు ఇంటికి కేజీ బంగారం, ఒక బెంజ్‌ కారు ఇస్తామని హామీ ఇస్తారని చంద్రబాబును నమ్మొద్దని తెలిపారు. తమ ప్రభుత్వంలోనే చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీలో ఎన్నో మార్పులొచ్చాయని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం వరకు అమలు చేశామన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని అందుకే ఇంట్లో వాళ్లందరూ కూర్చుని చర్చించుకుని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఆయా చోట్ల ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️