డ్వాక్రాలకు ఏమీ ఇవ్వకుండా పేదరిక నిర్మూలన ఎలా సాధ్యం?

Dec 29,2023 10:11 #aidwa, #Dwcra, #Punyavati
aidwa on self help groups

 

స్వయం సహాయక సంఘాల సదస్సులో  ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : Dwaడ్వాక్రాలకు ఎలాంటి సహాయం చేయకుండా మహిళా సాధికారత ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వాలు చెప్పాలని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి డిమాండ్‌ చేశారు. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో మోటూరు ఉదయం ట్రస్టు ఆధ్వర్యాన స్వయం సహాయక సంఘాల సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా పుణ్యవతి హాజరై మాట్లాడారు. దేశంలో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి వున్నారని అన్నారు. 67 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. 140 దేశాల్లో లెక్కలు తీస్తే మనం 111 స్థానంలో వున్నామని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలని అన్నారు. ప్రపంచ వేదికలపై మనం తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. మహిళలకు ఆర్థిక వెసులుబాటు, ఉచిత విద్య వుంటేనే సాధికారత సాధ్యమవుతుందని మహిళా సంఘాలు చెబుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్థికంగా వెసులుబాటు రావాలంటే భూములను పంచాలని కోరుతున్నా అమలు చేయడం లేదని, భూమి, బంగారు నగలు వుంటేనే బ్యాంకులు రుణాలు ఇస్తాయి తప్ప పేద మహిళలకు ప్రభుత్వాలు ఇప్పించడం లేదని అన్నారు. మహిళలు తమ డబ్బును బ్యాంకులో పొదుపు చేసుకుని వాటిపై అప్పు తీసుకుని పేదరికం నుండి బయటపడాలని చెబుతోంది తప్ప ప్రభుత్వం డ్వాక్రాల కోసం పైసా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందని అన్నారు. మహిళల పోరాటాలతోనే పొదుపు రుణాలకు వడ్డీ రాయితీని సాధించుకున్నా.. అది కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌లకు రూ.15 లక్షల కోట్లు బ్యాంకు రుణాలను మాఫీ చేసిన పాలకులు కోట్లాది మంది మహిళలకు సంబంధించి రుణాలకు వడ్డీ మాఫీ చేయలేదా? అని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో పొదుపు మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ప్రభుత్వం సరైన మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కూడా ఇవ్వడం లేదని విself heమర్శించారు. బహుళజాతి కంపెనీల ఉత్పత్తులకు పాలకులు మార్కెటింగ్‌ చేస్తుండటం సరైంది కాదన్నారు.ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ.. మహిళలు కట్టే పొదుపు డబ్బులే రూ.18 వేల కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో వుందన్నారు. ఈ డబ్బుకు అర్ధ రూపాయి వడ్డీ ఇచ్చినా.. రూ.3 వేల కోట్లు అవుతుందన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వాలు ఆ మేర సాయం చేస్తున్నాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం డ్వాక్రాలకు పెద్దయెత్తున సాయం చేస్తున్నట్లు ఆర్భాటం చేస్తోందని విమర్శించారు. రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెబుతున్న ప్రభుత్వం ఒక్కో మహిళకు సగటున రూ.8 వేల చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు. సున్నా వడ్డీ కూడా సకాలంలో సక్రమంగా ఇవ్వడం లేదని అన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు శ్రీదేవి, ఎన్‌ అలివేలు తదితరులు పాల్గొన్నారు.

➡️