ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Feb 5,2024 10:26 #AP assembly meetings, #Begins
low Attendance in the assembly

ప్రజాశక్తి- అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్‌ మాట్లాడుతూ … తమ ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామని, అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయమని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నామన్నారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రశంసించారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు అమలవుతున్నాయని చెప్పారు. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నామని గవర్నర్‌ తెలిపారు.

గవర్నరు ప్రసంగం, ఓట్‌ ఆన్‌ అకౌంట్‌, బిల్లుల ఆమోదానికి మరొకరోజు మొత్తం మూడురోజులు సభ జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఈరోజు ఉదయం జరిగే బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ(బిఎసి)లో నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో ల్యాండ్‌ బిల్లుపైనా చర్చించనున్నారు. డిఎస్‌పి పోస్టుల భర్తీ, పెట్టుబడులు, డిబిటి తదితర అంశాలపై స్వల్పకాలిక చర్చలూ జరపనున్నారు.

➡️