మోడీతో బాబు, జగన్‌ రాజీ

Apr 22,2024 21:11 #candidate, #cpm, #Kurnool, #nomination
  • సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌
  •  అట్టహాసంగా పాణ్యం సిపిఎం అభ్యర్థి నామినేషన్‌

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీతో చంద్రబాబు, జగన్‌ రాజీ పడుతున్నారని, వారితో పోరాడుతున్న సిపిఎంను గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ కోరారు. పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి.గౌస్‌దేశారు సోమవారం భారీ ప్రదర్శనతో కర్నూలు కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత చెన్నమ్మ సర్కిల్‌ నుంచి ఐటిసి, కృష్ణానగర్‌, బిర్లాగేట్‌, గాయత్రి ఎస్టేట్‌, వినాయక ఘాట్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
నామినేషన్‌ అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గం చాలా వెనకబడిన ప్రాంతమని, కల్లూరు అర్బన్‌ పరిధిలో తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప టిడిపి, వైసిపికి మరో అజెండా లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం టిడిపి, వైసిపిలు ఏం చేశాయని ప్రశ్నించారు. మోడీని ఇంటిని పంపేందుకే 28 పార్టీలు ఇండియా వేదికగా ఏర్పడ్డాయని చెప్పారు. రూ.12 లక్షల కోట్లు అప్పు తెచ్చి 2.70 లక్షల కోట్లకు బటన్‌ నొక్కారని, మిగిలిన రూ.9 లక్షల కోట్లు ఎవరి కోసం బటన్‌ నొక్కారని సిఎం జగన్‌ను ప్రశ్నించారు. నంద్యాల కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి, డిసిసి అధ్యక్షులు జె.లక్ష్మినరసింహ యాదవ్‌ మాట్లాడుతూ.. అధికారం ఉన్నా లేకున్నా పోరాటం చేసే వ్యక్తి గౌస్‌ దేశారు అని, అలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపించాలని కోరారు. హోదా వచ్చి ఉంటే రాయలసీమకు పరిశ్రమలు వచ్చేవని, విభజన హామీలను సాధించడంలో టిడిపి, వైసిపి విఫలం చెందాయని విమర్శించారు. సిపిఎం పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి డి.గౌస్‌ దేశారు మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా పాణ్యం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఇండియా వేదికగా కృషి చేస్తామని, సోలార్‌, ఎపిఐఐసిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. నామినేషన్‌ ప్రదర్శనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి, రాంభూపాల్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, పి.నిర్మల, సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌, సిపిఐ జిల్లా నాయకులు జగన్నాథం పాల్గొన్నారు.

➡️