సిఎఎ భారత రాజ్యాంగాన్కి విరుద్ధం – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 14,2024 21:15 #MLC KS Lakshmana Rao, #speech

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సిఎఎ (పౌరసత్వ సవరణ యాక్ట్‌) చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందని ఎమ్మెల్సీ, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ఆవాజ్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి అంజుమన్‌ షాదీఖానాలో అవాజ్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌కె భాష అధ్యక్షతన సిఎఎపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలని ఉద్దేశంతో సిఎఎను తీసుకువచ్చిందన్నారు. 2019 సంవత్సరంలో సిఎఎ చట్టం చేయాలని ప్రయత్నించినపుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని గుర్తుచేశారు. అయితే ఇటీవల ఎన్నికలకు ముందు సిఎఎ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడంతో దేశ ప్రజల్లో మరింత ఆందోళన నెలకొందని అన్నారు. సిఎఎ వల్ల ముస్లిములకే కాదని, దేశ ప్రజలందరికీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కార్పొరేట్‌ మతోన్మాద బిజెపి పార్టీని, దాని మిత్రులను రానున్న ఎన్నికల్లో ఓడించాలని కోరారు. సిఎఎను మన రాష్ట్రంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపరిచాయని, ప్రత్యక్షంగా టిడిపి, పరోక్షంగా వైసిపి పార్టీలు బిజెపికి అనుకూలంగా ఉన్నాయని వివరించారు. ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిష్టి మాట్లాడుతూ కార్పొరేట్‌ మతోన్మాద బిజెపి అవలంబిస్తున్న విధానం వల్ల దేశ ప్రజలందరిపై భారాలు పడుతున్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం బిజెపి మతాన్ని వాడుకుంటోందని అన్నారు. బిజెపిని, దాన్ని పొత్తు పార్టీలు టిడిపి, జనసేనలను, తొత్తు పార్టీ వైసిపిని ఓడించాలని, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సదస్సులో మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ వివి జవహర్లాల్‌, అంజుమన్‌ కమిటీ అధ్యక్షులు షేక్‌ అక్రమ్‌, ఎంపిజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి యూసుఫ్‌, ఎస్‌కె మునీర్‌, ఎస్‌ సలీం, సైదా సాహెబ్‌, ఆవాజ్‌ పట్టణ కమిటీ కన్వీనర్‌ షేక్‌ జానీ భాష, అవాజ్‌ నాయకులు పి అన్వర్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️