సిఎఎతో యావత్తు దేశానికి హానికరం

  • సదస్సులు, రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల ఆందోళన

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి :  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఒక రాష్ట్రానికో, ముస్లిములకో నష్టం కాదని, యావత్తు దేశానికే హానికరమని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మతంతో సహా అన్ని మతాల వారికీ ఇబ్బందులు తప్పవని, అస్సాంలో శిబిరాల్లో తలదాచుకున్న వారే దీనికి ఒక ఉదాహరణని పేర్కొన్నారు. దేశాన్ని బలహీనపరిచే ఈ చట్టాన్ని అందరూ కలిసికట్టుగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సిఎఎకు వ్యతిరేకంగా శ్రీకాకుళం, నంద్యాలలో సదస్సులు, ఏలూరులో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆదివారం నిర్వహించారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, జై భారత్‌ పార్టీల ఆధ్యర్యాన శ్రీకాకుళంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ మాట్లాడుతూ కార్పొరేట్లు, మతతత్వశక్తులు కలిసి సాగిస్తున్న దోపిడీ విధానాలపై జనం ఏకం కాకుండా మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తోందన్నారు. సిఎఎ వల్ల నష్టం గురించి జగన్‌కు, చంద్రబాబుకు తెలిసినా స్పందించకుండా బిజెపికి లొంగుబాటు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. పైగా, ఈ చట్టం వేరే రాష్ట్రాలకు సంబంధించినదని చంద్రబాబు చెప్పడం శోచనీయమన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలోనూ సిఎఎను అమలు చేయబోమని ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవివి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ అస్సాంలో నిర్వహించిన సర్వేలో ముస్లిములు ఆరు లక్షల మంది ఉంటే, హిందువులు 12 లక్షల మంది ఉన్నారని, వీరంతా ఈ దేశ పౌరులమని ఆధారాలు చూపించాల్సిన పరిస్థితులు వచ్చాయని వివరించారు.

నంద్యాల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ చిష్టీ మాట్లాడుతూ అస్సాంలో జారీ చేసిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి)ని దేశమంతటికీ విస్తరింపజేయాలని చూస్తున్నారని, దీనివల్ల దేశంలోని ముస్లిములకే కాక హిందువులు, ఇతర ప్రజానీకానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. సరైన పత్రాలు సమర్పించలేని వారంతా విదేశీయులుగా ముద్రపడి శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి ఉంటుందన్నారు.
ఏలూరు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షులు మస్తాన్‌, జమాతే ఇస్లామిక్‌ సంస్థ అధ్యక్షులు ఇస్మాయిల్‌ షరీఫ్‌, బిఎస్‌పి ఏలూరు అధ్యక్షులు రత్నబాబు మాట్లాడారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశ ప్రజలను మత ప్రాతిపదికన విడగొట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. సిఎఎను మన రాష్ట్రంలో అమలు చేయబోమని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

➡️